మొన్న చలో విజయవాడ.. ఇవాళ చలో విశాఖ.. ఇక జగనన్న చల్ చలో!
Publish Date:Mar 7, 2022
Advertisement
సీఎం జగన్ పాలనపై అన్నివర్గాలు అసహనంతో రగిలిపోతున్నాయి. తమ బతుకులు రోడ్డుపాలు చేస్తున్న ముఖ్యమంత్రిపై అసహనంతో రోడ్డెక్కుతున్నాయి. అందుకే, జగన్కు వ్యతిరేకంగా ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా.. అది భారీ సక్సెస్ అవుతోంది. ఏ వర్గం ఆందోళనకు పిలుపిచ్చినా వేలాదిగా జనం కదిలివస్తున్నారు. జగనన్నపై ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఇటీవల పీఆర్సీ-జీతాల తగ్గింపునకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపిచ్చారు. అదే రేంజ్‌లో సక్సెస్ అయిందో అంతా చూశారు. ఇసుకేస్తే రాలనంతగా ఉద్యోగులు తరలివచ్చి విజయవాడను ఎరుపెక్కించారు. చలో విజయవాడతో ఉద్యోగుల సెగను తట్టుకోలేక.. జగనన్న దిగొచ్చారు. హెచ్ఆర్ఏ కాస్త పెంచి మమ అనిపించారు. కట్ చేస్తే.. లేటెస్ట్‌గా కనీస వేతనం అమలు చేయాలనే డిమాండ్‌తో విశాఖలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. విశాఖ సరస్వతి పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తానని పాదయాత్ర సమయంలో సీఎం జగన్ చెప్పారని అంగన్వాడీలు గుర్తు చేశారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని.. తక్షణం ప్రభుత్వం స్పందించి వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలో నిరసనకు పెద్ద సంఖ్యలో అంగన్‌వాడీలు తరలివచ్చారు. ఎర్రజెండాలతో విశాఖను ఎరుపెక్కించారు. వీళ్లంతా కేవలం ఒక్క జిల్లాకు చెందిన అంగన్‌వాడీలే. అదే.. ఏపీ వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీలు కనుక చలో విశాఖకు పిలుపు ఇచ్చి ఉంటే.. మరో చలో విజయవాడలా జగన్ సర్కారును షేక్ చేసి ఉండేదని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో ఇలాంటి నిరసన కార్యక్రమాలతో తేటతెల్లం అవుతోందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/anganvadies-in-vishaka-39-132701.html





