మట్టి సత్యాగ్రహమా? సిగ్గుండాలి!
Publish Date:Nov 4, 2015
Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మట్టిలో కలిపేసినా ఆ పార్టీ నాయకులకు జ్ఞానోదయం కలిగినట్టులేదు... అందుకే ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో అధికారం సాధించాలన్న ఆశతో, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలన్న పథకంతో తంటాలు పడుతున్నారు. ఆ తంటాల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ‘ఉప్పు సత్యాగ్రహం’ తరహాలో ‘మట్టి సత్యాగ్రహం’ చేయబోతోందని ఆ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. అసలు ఇలాంటి పనీపాటాలేని సత్యాగ్రహాలు చేయడానికి ఎవరికైనా సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గు వుందని రాష్ట్రంలో కొద్దిమంది అయినా భావిస్తూ వుంటారు. అయితే ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల ఆ కొద్దిమందికి కూడా తమ అభిప్రాయాలన్ని మార్చుకోవాలన్న ఆలోచన రావడం సహజం.
గాంధీజీ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహం చేశారంటే ఒక అర్థం వుంది. దాని స్ఫూర్తితోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు మట్టి సత్యాగ్రహం చేయబోతున్నారట. ఆంధ్రప్రదేశ్‌ని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్రాన్ని కదిలించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడం వల్ల తాము మట్టి సత్యాగ్రహాన్ని చేపట్టనున్నామని రఘువీరారెడ్డి వారు సెలవిచ్చారు. అయితే మట్టి సత్యాగ్రహమో, మశానం సత్యాగ్రహమో చేపట్టేముందు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అనే విషయం రఘువీరా గారు మరచిపోయినట్టున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, ఆంధ్రప్రదేశ్ చేతికి చిప్ప రావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని రఘువీరాగారు విస్మరించినట్టున్నారు. మరచిపోవడం, విస్మరించడం కాదు.. ఆయన జనాల జ్ఞాపక శక్తి మీద చాలా అపనమ్మకం పెట్టుకుని తెలివిగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి నాటకాలు ఎన్ని ఆడినా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి కోలుకోవడం కలలోమాట. ఆంధ్రప్రదేశ్ ప్రజల నోళ్ళలో మట్టి కొట్టిందే కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆ పార్టీ మట్టి సత్యాగ్రహం చేస్తామని అంటే మురిసి ముద్దులుపెట్టేవాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ లేరు.
http://www.teluguone.com/news/content/andhra-pradesh-congress-45-52008.html





