పెళ్లి చేసుకుంటాను.. పిల్లను చూడండి.. మంత్రి రోజాకు వృద్ధుడి వింత విన్నపం
Publish Date:May 17, 2022
Advertisement
పెళ్లాడాలి, పిల్ల కావాలి అంటూ యమగోల సినిమాలో హీరో అడిగినట్లుగా ఓ వృద్ధుడు ఏకంగా మంత్రి రోజాను అడిగాడు. అది కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో. ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ పిలుపు మేరకు జరుగుతున్న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నిరసన సెగల్లోనూ అక్కడక్కడ హాస్య భరిత సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. చిత్ర విచిత్రమైన వినతులు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు అందుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో అదీ ఒక భాగమేనా అన్న సంగతి పక్కన పెడితే గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా మంత్రి రోజాకు ఒక వృద్ధుడు వింత విన్నపం చేశారు. నగరి నియోజకవర్గ పరిధిలో గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొన్న రోజాకు పలు చోట్ల నిరసన సెగలు తగిలినా.. ఒక చోట మాత్రం విచిత్రమైన విన్నపంతో ఒక వృద్ధుడి ఆమె ముందుకు వచ్చాడు. ఒంటరినైన తనను చూసుకోవడానికి ఎవరూ లేరనీ, పెళ్లి చేసుకోవడానికి ఒక పిల్లను చూసి పెట్టాలనీ ఆమెను కోరాడు. ఆ వృద్ధుడి విన్నపాన్ని రోజా ఒక నవ్వుతో పక్కన పెట్టేసి.. వృద్ధాప్య పింఛను కావాలా నన్నడుగు, అంతే కానీ పిల్లను చూడటం తన వల్ల కాదని చెప్పి అక్కడ నుంచి ముందుకు కదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకూ కార్యక్రమం సాగుతున్నప్పటికీ చాలా ప్రాంతాలలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ కార్యక్రమానికి ముఖం చాటేస్తున్నారు. అధినేత ఆదేశాలను బేఖాతరు చేస్తూ గడప గడపకూ కార్యక్రమానికి డుమ్మా కొడుతున్నారు. ఇంత కాలం తమను గుర్తించని పార్టీ ఇప్పుడు ప్రజా నిరసనను ఎదుర్కొనేందుకు జనంలోకి పంపుతోందని అంటున్నారు. అన్నిటికీ వాలంటీర్లే అంటూ తమను పూచికపుల్లలా పక్కన పెట్టిన జగన్ ఈ గడప గడపకూ కార్యక్రమాన్నికూడా వాలంటీర్లతోనే నిర్వహించుకోవడం మంచిదని పలువురు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. పైకి మాత్రం గడప గడపకూ కార్యక్రమానికి డుమ్మా కొట్టడానికి మాత్రం మెటీరియల్ అందలేదు, వర్షాలు, నియోజకవర్గ పనులు అంటూ సాకులు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/an-old-man-surprises-minister-roja-by-asking-to-see-a-girl-for-him-to-marry-25-136002.html





