ఆ హోంమంత్రి టార్గెట్ నెలకు 100 కోట్లు!
Publish Date:Mar 20, 2021
Advertisement
ముంబైలో కలకలం రేపిన ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు ఇప్పటికే మహారాష్ట్ర పోలీస్ శాఖను షేక్ చేస్తుండగా..తాజాగా రాజకీయ నేతలు, పోలీసు అధికారులకు మధ్య వార్ జరుగుతోంది. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో సరిగా విచారణ చేపట్టని కారణంగా ప్రభుత్వం బదిలీ చేసిన మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ బాంబ్ పేల్చారు. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు లేఖ రాసిన పరమ్ బీర్ సింగ్.. దిమ్మతిరిగే విషయాలు చెప్పారు. అయితే పరమ్ బీర్ సింగ్ ఆరోపణలను మంత్రి దేశ్‌ముఖ్ ఖండించారు. ముకేశ్ అంబానీ, మన్‌సుఖ్ హిరెన్ కేసులో సచిన్ వేజ్ పాత్ర ఉందని దర్యాప్తులో తేలిందని, ఈ కేసులో లింకులన్ని సింగ్ వైపే దారి తీస్తున్నాయని అన్నారు. వాటి నుంచి బయటపడేందుకే సింగ్ తనపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి దేశ్‌ముఖ్ తెలిపారు.
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో అరెస్ట్ అయిన సచిన్ వాజేను ప్రతి నెలా 100 కోట్ల రూపాయలు వసూలు చేసి తీసుకొచ్చి ఇవ్వాలని మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించారని చెప్పారు. రెస్టారెంట్లు, హోటళ్లు తదితరాల నుంచి లంచాలు వసూలు చేసి తీసుకొచ్చి తనకు ఇవ్వాలని అడిగేవారన్నారు. ఆ సమయంలో మంత్రి వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారన్నారు పరమ్ బీర్ సింగ్. వంద కోట్ల రూపాయల లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గాలను కూడా మంత్రి సూచించారని సింగ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ముంబైలో 1,750 బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయని, ఒక్కో దాని నుంచి రూ. 2-3 లక్షలు వసూలు చేసినా నెలకు రూ. 40-50 కోట్లు అవుతుందని, మిగతా మొత్తాన్ని ఇతర వనరుల ద్వారా సేకరించాలని వాజేను మంత్రి ఆదేశించారని వివరించారు.
http://www.teluguone.com/news/content/ambani-case-mumbai-ex-cp-parambeer-singh-sensational-comments-on-home-minister-anil-deshmukh-25-112239.html





