అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ.. తిరుపతిలో జోరుగా ఏర్పాట్లు..
Publish Date:Dec 16, 2021
Advertisement
ఒక్కరోజే గడువుంది. ఒక్కరోజులోనే ఆంధ్రప్రదేశ్ అదిరిపోయేలా భారీ బహిరంగ సభ జరపాలి. హైకోర్టు నిర్ణయం బుధవారం సాయంత్రమే వచ్చింది. శుక్రవారం తిరుపతిలో అమరావతి రైతుల సభకు అనుమతి లభించింది. అదికూడా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకే పర్మిషన్. అందుకే, రాజధాని రైతులు కాలంతో పోటీ పడుతున్నారు. వడివడిగా బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి బహిరంగ సభకు.. "ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ" అని నామకరణం చేశారు. సభా ప్రాంగణంలో భూమి పూజ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుచానూరు సమీపంలోని దామినీడు దగ్గర సభ జరగనుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, వైసీపీ నర్సాపురం ఎం.పీ రఘురామ కృష్ణంమరాజు, కాంగ్రెస్ పార్టీ నేతలు శైలజానాథ్, తులసి రెడ్డి, సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ, తదితర కీలక నేతలు బహిరంగ సభకు హాజరుకానున్నారు. పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొంటారు. మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా శుక్రవారం తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు బుధవారం హైకోర్టు అనుమతి ఇచ్చింది. సభకు అనుమతి నిరాకరించడానికి పోలీసులు తెలిపిన కారణాలు సహేతుకంగా లేవని తప్పుబట్టింది. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందనే కారణంతో అనుమతి నిరాకరించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఆ పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. 3 రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సభ నిర్వహించుకొనేందుకు అనుమతి నిరాకరించడం ప్రాథమిక హక్కులను హరించడమేనని తెలిపింది. సమస్యలపై ఉద్యమించడం, గొంతెత్తడం కూడా ప్రాథమిక హక్కేనని స్పష్టం చేసింది. హైకోర్టు అనుమతి తర్వాత.. అమరావతి రైతులు బహిరంగ సభకు అత్యంత వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/amaravati-meeting-arrangements-at-tirupati-39-128482.html





