అమరావతి ఒకటే.. అందరి నోటా అదే మాట..
Publish Date:Dec 30, 2021
Advertisement
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అమరావతికి జై కొట్టింది. ఇంతకాలం పార్టీలో ఒక వర్గం అటు ఒక వర్గం ఇటు ఊగుతున్నా, ఇప్పడు పార్టీ కేంద్ర నాయకత్వం విజయవాడ బహిరంగ సభ వేదిక నుంచి, ఎలాంటి శషబిషలు, సందేహాలు లేకుండా, ఒకటే రాష్ట్రం ఒకటే రాజధానని తేల్చి చెప్పింది. నిజానికి, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆదేశాలతో అమరావతి రైతుల అపూర్వ పాదయాత్రలో బీజేపీ నాయకులు భాగస్వాములయ్యారు. ఇప్పుడు బహిరంగ వేదిక నుంచి అమరాతికి జై కొట్టారు. కేంద్ర మాజీమంత్రి, ప్రకాష్ జవదేకర్ అమరావతి ఒక్కటే రాజధానిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు గుంటూరు జిల్లా తాడేపల్లిలో మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్ర మహాసభల్లో సీపీఎం రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సీపీఎం డిమాండ్ చేసింది.ఆ మేరకు తీర్మానం చేసింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధితో రాజధానిని ముడిపెట్టడం సరికాదని, మూడు రాజధానుల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వెల్లడించింది. అమరావతి రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీల సాధనకు పోరాడతామని, మరోసారి ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నామని పేర్కొంది.దీంతో, రాజదాని విషయంలో ఒక్క అధికార వైసీపీ మినహా, మిగిలిన అన్ని పార్టీలు ఒకటే ఆభిప్రాయంతో ఉన్న విషయం మరో మారు స్పష్టమైంది. అయితే, వైసీపీకి అసెంబ్లీలో సంఖ్యా బల ముంది. ఆ సంఖ్యా బలం ఆధారంగానే ముఖ్యమంత్రి, ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను కాలరాస్తున్నారు. కానీ, కారణాలు ఎవైనా వైసీపీ ప్రభుత్వం, మూడు రాజధానుల చట్టాన్ని ఇటీవల వెనక్కి తీసుకుంది. అయితే, అదే చట్టాన్ని మరింత పటిష్టంగా తీసుకొస్తామని, ముఖ్యమంత్రి శాసన సభలోనే చెప్పారు. అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అరంగేట్రం చేయడంతో పాటుగ, రాష్ట్రంలోని అన్ని పార్టీలు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకున్న చట్టాన్ని మళ్ళీ ముందుకు తీసుకు వచ్చే సాహసం చేయక పోవచ్చని .. అంటున్నారు. మరో వంక, రాబోయే రోజుల్లో వైసీపీ పాలనను అంతం చేయాలంటే టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే, చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అయితే, ఈ మూడు పార్టీలు గతంలో ఏదో ఒక సందర్భంలో కలిసున్న పార్టీలే .అయినా, మళ్ళీ కలుస్తాయా అంటే ..రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని అంటున్నారు.
అలాగే, ఇప్పుడు సీపీఐ (ఎం) అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాష్ట్ర మహాసభల్లో తీర్మానం చేసింది. మూడు రాజధానులకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది.నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రస్తావన చేసినప్పటి నుంచీ కూడా, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, జనసేన, కాంగ్రెస్ పార్టీలు, ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీతో గొంతు కలిపి, అమరావతి రైతుల ఆందోళనకు మద్దతు పలుకుతున్నాయి. కమ్యూనిస్టులు ప్రత్యక్షంగానూ పోరాటంలో పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/amaravati-is-become-common-agenda-for-all-39-129350.html





