నరకాన్ని చూపిస్తున్న ఆదిలాబాద్ గిరిజన పాఠశాలలు
Publish Date:Feb 20, 2012
Advertisement
ఆదిలాబాద్ జిల్లా: అమ్మ లాలనకు... నాన్న పాలనకు మారుపేరుగా పనిచేయాల్సిన ప్రభుత్వ గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలల నిర్వహణ ఆదిలాబాద్ జిల్లాలో నరకానికి నకళ్ళుగా మారాయి. సంక్షేమం మాట దేవుడెరుగు మురికి కూపాల్లో ఇరుకు గదుల్లో గిరిజన విద్యార్ధులు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. జిల్లాలో మొత్తం 142 గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమోన్నత పాఠశాలలుంటే ఇందులో 123 కొలాన్ ఆశ్రమోన్నత పాఠశాలలు, 13 కస్తూర్బా పాఠశాలలు, 6 గురుకులాలు ఉన్నాయి.వీటిలో దాదాపు 35వేల మంది విద్యార్ధులు చదువుతున్నారు. కనీస వసతుల్లేని ఇరుకుగదుల్లో కొనసాగుతున్న ఆశ్రమోన్నత పాఠశాలల నిర్వహణ కారాగారాలకు నకళ్ళుగా మారాయి. సరిపడా గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక విద్యార్ధులు అవస్తలు పడుతున్నారు. గదుల్లో ఫ్యాన్లు లేక దోమలతో పోరాటం చేస్తున్నారు. ఉపాధ్యాయుల నియామకాలకు ఆరోగ్య కార్యకర్తల పోస్టుల భర్తీకి దిక్కులేదు. జిల్లాలో 55 మంది ఆంగ్లం, 50 మంది ఫిజిక్స్,మరో 50 మంది గణితం చెప్పే మాస్టార్లు లేరంటే విద్యార్ధుల చదువు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రతి రాత్రి ఆలుగడ్డ, అన్నం, పప్పు మాత్రమే పెడుతుండడంతో విద్యార్ధులు అయిష్టంగా భుజిస్తున్నారు. ఈ పాఠశాలలకు కేటాయించిన కంప్యూటర్లన్నీ బూజుపట్టి మూలనపడ్డాయి. ఒక్కో పాఠశాలకు 15 కంప్యూటర్లు, జనరేటర్, ఫర్నిచర్, ఇతర సామాగ్రి పంపిణీ చేసినా బోధకులు లేకపోవడంతో వాటికి చేసిన కోట్లాది రూపాయల వ్యయం వృధాగా మారింది.
http://www.teluguone.com/news/content/adilabad-24-12030.html





