తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న పెద్ద పులి
Publish Date:Dec 2, 2024
Advertisement
తెలుగు రాష్ట్రాలకు పెద్ద పులి భయం పట్టుకుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసాలలో మగపెద్ద పులులు ఆడపులుల కోసం వెతుకుతుంటాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి మగ పెద్ద పులులు తెలుగు రాష్ట్రాలో ఎంటర్ అయినట్టు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. పులులు గత రెండు రోజులుగా ఎపిలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి , సంతబొమ్మాళి మండలాల్లో బెంగాల్ టైగర్ సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పొడుగుపాడు సమీపంలో రోడ్డు దాటుతుండగా పులిని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమీప ప్రాంతాల్లో పులి ఆనవాళ్లు గుర్తించిన అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా, ఇటీవలే ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. ఓ యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన మరువకముందే సంతబొమ్మాళి మండలం హనుమంతునాయుడుపేట పంచాయతీలో ఓ ఆవుపై దాడి చేసి చంపేసింది.ఈ క్రమంలో టెక్కలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పులి జాడ కోసం అటవీ సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు. ఒంటరిగా రాత్రి పూట ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. పులిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. పెద్ద పులి భయంతో సాయంత్రమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనం వణుకుతున్నారు. అటు, పులి సంచారంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో పెద్ద పులి ఆనవాళ్లు గుర్తించామని.. ఒడిశా నుంచి పులి టెక్కలి వైపు వచ్చి ఉంటుందని అటవీ అధికారులు మంత్రికి వివరించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో గ్రామాల్లో చాటింపు వేయించిన అధికారులు.. కరపత్రాలు పంపిణీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని.. గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు.అటు, తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ కొన్ని రోజులుగా పులులు స్వైర విహారం చేస్తున్నాయి. పశువుల మందలపై దాడులు చేస్తూ వచ్చాయి. చివరకు పత్తి ఏరుతున్న ఓ యువతిపై దాడి చేసి చంపేసింది. కుమ్రం భీం జిల్లా కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి మరో ఆరుగురు మహిళలతో కలిసి నజ్రుల్నగర్ గ్రామ శివారులోని చేనులోకి పత్తి ఏరేందుకు వెళ్లారు. కొంతసేపటికే చేనులోకి వచ్చిన పెద్దపులి మహిళపై దాడి చేసి నోట కరచుకుని వెళ్లింది. అక్కడున్న వారు కేకలు వేయడంతో ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. స్థానికులు తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.ఈ ఘటనతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. కాగజ్నగర్ మండలంలో ఆంక్షలు విధించారు. దాదాపు పది, పదిహేను గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు.
http://www.teluguone.com/news/content/a-big-tiger-shaking-the-telugu-states-39-189313.html