కండ్లు పీకేసి 13 నెలల బాలిక హత్య.. హైదరాబాద్ లో మరో కిరాతకం
Publish Date:Sep 13, 2021
Advertisement
హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలిక దారుణ హత్య ఘటన మరవకముందే నగరంలో మరో కిరాతకం ఘటన వెలుగులోకి వచ్చింది. మియాపూర్లో ఆదివారం ఉదయం అదృశ్యమైన 13 నెలల బాలిక మృతదేహం ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో లభ్యమైంది. ఆ పాప కళ్లు పొడిచి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 13 నెలల బాలికను అత్యంత కిరాతకంగా చంపేసి అక్కడ పడేసి వెళ్లినట్లు భావిస్తున్నారు. పాత ఇనుప సామగ్రి, ప్లాస్టిక్ ఏరుకుని అమ్మి జీవిస్తుంటారు ఆ పాప తల్లిదండ్రులు. ఆ బాలికను పక్కింట్లో వదిలి పనులకు వెళ్లారు. అయితే తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చే సరికి బాలిక కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలోనే ఆ పాప మృతదేహం ఇంటి సమీపంలో ఖాళీ స్థలంలో కనపడింది. అయితే బాలిక విషయంలో తల్లిదండ్రులు చెబుతోన్న వివరాల్లో స్పష్టత లేదని పోలీసులు అంటున్నారు. తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రశ్నిస్తున్నారు. ఓ గుర్తు తెలియని 12 ఏళ్ల బాలుడు నిన్న సాయంత్రం తమ పాపను తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. అనంతరం ఆ బాలుడు కూడా అదృశ్యమైనట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలిక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం స్పష్టిస్తోంది. సైదాబాద్ ఘటనపై తీవ్ర దుమారం రేగుతున్న సమయంలో మియాపూర్ లోనూ అలాంటి ఘటనే వెలుగు చూడటం పోలీసులను కలవరానికి గురి చేస్తోంది.
http://www.teluguone.com/news/content/13-months-girl-murdered-in-hyderabad-39-122877.html





