వాంగ్ చుక్ నిరశన.. రోజురోజుకూ పెరుగుతున్న ప్రజామద్దతు.!
Publish Date:Jul 17, 2026
Advertisement
పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో సోనమ్ నిరశన చేపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలో సోనమ్ వాంగ్‌చుక్ ప్రత్యక్షంగా పాల్గొని నిరాహార దీక్ష చేపట్టడం రాజకీయంగా కూడా ప్రధాన్యత సంతరించుకుంది . సోనమ్ వాంగ్ ఛుక్ చేపట్టిన నిరవధిక నిరశనకు రోజురోజుకూ ప్రజాదరణతో పాటు నెటిజన్ల మద్దతు కూడా పెరుగుతోంది. కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా వేదికగా ఉద్భవించి, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయ పోరాటాల్లోకి అడుగుపెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవడమే కాకుండా.. నిరశన దీక్ష చేపట్టి, ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకునే వరకు దీక్షను విరమించేది లేదని ప్రకటించారు. ఈ పరిణామం కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకు ఒక్కసారిగా జాతీయ స్థాయి ప్రాధాన్యత వచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వాంగ్ చుక్ నిరశనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. అలాగే సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వెళ్ల నిరశన దీక్షలో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్‌ను కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు. ఇలా విపక్షాల మద్దతు, ప్రజా సంఘాల భాగస్వామ్యంతో ఈ ఆందోళన తీవ్ర రూపం దాలుస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇంత వరకూ స్పందించలేదు. ఇలా స్పందించకపోవడానికి సోనమ్ వాంగ్ చుక్ నిరసన, కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనల ప్రభావం కేంద్రంపై ఇసుమంతైనా లేదని చాటే వ్యూహమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. సోనమ్ వాంగ్ చుక్ కు పెరుగుతున్న మద్దతు, యువత నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహంతో కేంద్రం ఒకింత ఆందోళన చెందుతున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. అంతే కాదు.. సోనమ్ వాంగ్ చుక్ నిరశన విషయంలో ప్రభుత్వ మౌనం, నిర్లక్ష్యం పట్ల నెటిజనులు ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ లీకేజీ అంశంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తు దేశ వ్యాప్తంగా విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వాంగ్ చుక్ నిరశనకు మద్దతు తెలుపుతూ.. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. public support growing day by day to Wangchuks protest, Cockroach Janta Party, Dharmendra Pradhan Resignation Demand, NEET Paper Leak Controversy, Jantar Mantar Delhi Protest
http://www.teluguone.com/news/content/-public-support-growing-day-by-day-to-wangchuks-protest-39-226259.html




