హరీశ్ రావు ఢిల్లీ పర్యటన...బీఆర్ఎస్‌లో కలకలం!
Publish Date:Apr 20, 2026
Advertisement
హరీష్ బీజేపీలోకి అంటూ ఒకటే ప్రచారం! ఢిల్లీ టూర్ వెనుక రహస్యం ఏంటి. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత బహిరంగ సభలో పాల్గొనడానికి సిద్ధమవుతున్న తరుణంలో, హరీశ్ రావు హఠాత్తుగా హస్తినకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ పర్యటనపై అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. హరీశ్ రావు ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటని కాంగ్రెస్ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్, బీఆర్ఎస్‌లో అంతర్గత పోరు మొదలైందని ఆరోపించారు. ఈ పరిణామాలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ మరియు కేటీఆర్‌లదేనని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరింత ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో హరీశ్ రావు బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. హరీశ్ రావు ఢిల్లీ వెళ్ళింది బీజేపీ అధిష్టానాన్ని కలవడానికేనని, త్వరలోనే ఆయన కమలం పార్టీ గూటికి చేరతారన్న ప్రచారం నిజమేనని సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, బీఆర్ఎస్ అధిష్టానం వెంటనే స్పందించింది. హరీశ్ రావు ఢిల్లీ పర్యటన వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, ఇది కేవలం పార్టీ పరమైన పని అని స్పష్టం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకే హరీశ్ రావు, వినోద్ కుమార్, వద్దిరాజు రవిచంద్రలతో కూడిన త్రిసభ్య కమిటీ ఢిల్లీకి వెళ్లిందని పార్టీ పేర్కొంది. ఏప్రిల్ 22న తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం కమిషన్ అంశంపై రాబోయే తీర్పు, అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులకు సంబంధించి న్యాయపరమైన సలహాలు తీసుకునేందుకే తాము ఢిల్లీ పర్యటన చేపట్టామని బీఆర్ఎస్ వివరణ ఇచ్చింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి, తదుపరి కార్యాచరణను సిద్ధం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఈ కేసుల విషయంలో బీఆర్ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలు, కోర్టుల తీర్పులు రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయ సమీకరణాలను ఏ మేరకు మార్చబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం, రానున్న కాలంలో రాజకీయ వేడిని మరింత పెంచే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/-harish-rao-25-217786.html





