వార్నీ.. ఈ ఎటకారం అమెరికా లెవల్లో వుందిగా!

ఏ రాజకీయ నాయకుడైనా ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఏమని స్టేట్‌మెంట్ ఇస్తాడు? ‘‘మా పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి.. మా పార్టీకి అధికారం దక్కుతుంది’’ అని స్టేట్‌మెంట్ ఇస్తాడు. అయితే మన జగన్ మాత్రం ‘‘వైనాట్ 175’’ అని ఎక్కడబడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు గొంతు చించుకుని మరీ అరిచాడు. తమ నాయకుడు ఇలా అరుస్తూ వుండేసరికి, అది నిజంగా జరుగుతుందేమోనని భ్రమపడి ఆయన వందిమాగధులు కూడా ‘వైనాట్ 175’ అంటూ గొంతుతోపాటు బట్టలు కూడా చించుకుంటూ అరిచారు. చివరికి ఏమైంది? జగన్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. అప్పటి నుంచి జగన్ అంటే 11 అన్నట్టు, 11 అంటే జగన్ అన్నట్టు మారిపోయింది. ఈ అంకె మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రోలింగే ట్రోలింగ్. ఇప్పుడీ ట్రోలింగ్ తెలుగు రాష్ట్రాలను దాటి అమెరికా దేశానికి కూడా చేరుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘Y NOT 11’ అనే అక్షరాలు, అంకెలతో వున్న వెహికల్ నంబర్ ప్లేట్ జగన్ పరువుని (వుందంటారా?) అమెరికాలో కూడా తీసిపారేసింది. ఓహియో రాష్ట్రానికి చెందిన ఒక తెలుగు ఎన్నారై తన వాహనానికి ‘Y NOT 11’ అనే నంబర్ ప్లేట్ తీసుకున్నాడు. ఆ రాష్ట్రంలో వాహనాల యజమానులు తమకు కావలసిన నంబర్ తీసుకునే అవకాశం వుంటుంది. వీటిని వానిటీ నంబర్ ప్లేట్లుగా పిలుస్తారు. అమెరికాలో వున్న ఈ ఫెసిలిటీ ఇండియాలో కూడా ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తోంది కదూ!