మోడీ గొంతులో బీహారీ వెలక్కాయ!

గొంతులో వెలక్కాయ ఇరుక్కుపోతే ఎలా వుంటుందో ప్రాక్టికల్‌గా తెలియకపోవచ్చుగానీ, ఊహించగలం. గొంతులో ఇరుక్కున్న వెలక్కాయని మింగలేం, కక్కలేం. అది అలా గొంతుకు అడ్డంగా పడి వుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొంతులో కూడా వెలక్కాయ ఇరుక్కుంది. వెలక్కాయ అంటే, నిజం వెలక్కాయ అనుకునేరు. సింబాలిక్ వెలక్కాయ.. బీహారీ వెలక్కాయ.. ఆ బీహారీ వెలక్కాయ పేరు నితీష్ కుమార్.

గతంలో చంద్రబాబు నాయుడికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎక్కడ విరోధం ఏర్పడిందో అందరికీ తెలిసిందే. ఈయనేమో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలని అడుగుతారు. ఆయనేమో ఇవ్వనంటారు.. అక్కడ వీరిద్దరి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. ఐదేళ్ళపాటు కొనసాగాయి. ఆ తర్వాత తాజా ఎన్నికల సందర్భంగా ఇద్దరి మధ్య సఖ్యత కుదిరింది. కలసి పోటీ చేశారు. ఏపీలో విజయం సాధించారు. కేంద్రంలో తక్కువ మెజారిటీ వచ్చిన బీజేపీకి చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు చంద్రబాబు నుంచి మోడీకి ప్రత్యేక హోదా డిమాండ్ ఏమీ లేదు. ఎందుకంటే, ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం. ప్రత్యేక హోదా అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే కాదు.. ఏ రాష్ట్రానికీ ఇచ్చే అవకాశం లేదు. అందుకే ఈ విషయంలో చంద్రబాబు కూడా ఒత్తిడి తెచ్చే ఉద్దేశంలో కూడా ఉన్నట్టు లేరు. అయితే, చంద్రబాబుతోపాటు బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా మోడీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. మోడీ ప్రభుత్వం కేంద్రంలో నిలబడటానికి నితీష్ కుమార్ మద్దతు కూడా కీలకమైనదే. అలాంటి మోడీ వీక్ పాయింట్‌ని పట్టుకున్న నితీష్ కుమార్ ఇప్పుడు బీహార్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని మోడీని డిమాండ్ చేస్తున్నారు. 

శనివారం నాడు జనతాదళ్ యునైటెడ్ జాతీయ కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ డిమాండ్ చేశారు. బీహార్‌కి అర్జెంటుగా ప్రత్యేక హోదా ఇవ్వాలి.. అది కుదరదంటే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి అని నితీష్ డిమాండ్ చేశారు. అది కూడా కుదరదు అని మోడీ అంటే, మీకు మద్దతు ఇవ్వడం కూడా కుదరదు అని నితీష్ కుమార్ చెబుతారు. దాంతో మోడీ ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే, నితీష్ కుమార్ డిమాండ్‌కి మోడీ ఎస్ చెప్పలేరు.. అలాగని నో అనలేరు. ఎస్ అంటే, దేశంలో అనేక రాష్ట్రాలు మాక్కూడా బీహార్‌కి ఇచ్చిన వరం కావాలని డిమాండ్ చేస్తాయి. నో అంటే, నితీష్ కుమార్ మద్దతు ఉపసంహరిస్తానంటారు.. అందుకే ఇప్పుడు మోడీ గొంతులో నితీష్ కుమార్ వెలక్కాయగా మారారు.