ఓ వైపు కెసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలు... మరో వైపు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జంప్ 

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో గత 15 రోజులుగా కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలకు మూడు రోజుల పాటు విరామం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్‌తో పార్టీ ముఖ్యనేతలు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆత్మీయ సమావేశాల పునఃప్రారంభ వివరాలను, ఏ నియోజకవర్గాల వారు ఎప్పుడు రావాలనే విషయాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
 తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్  ఘోర పరాజయం చెందింది. గత సంవత్సరం నవంబర్ 30 వ తేదీన తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ ప్రజాక్షేత్రానికి పూర్తిగా దూరమయ్యారు. తుంటి ఎముక విరిగి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా తన రాజకీయ సమీకరణాల ప్రకారమే నడుచుకున్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పరామర్శించడానికి వచ్చినప్పుడు కెటీఆర్, కవితలు తప్పించుకుని తిరిగారు. ఆ తర్వాతే కవిత లిక్కర్ స్కాం కేసులో ఇరుక్కుని తీహార్ జైలు పాలయ్యారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ అయితే కెసీఆర్ నివాసానికి వెళ్లి కలవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. 
కేసీఆర్ ముందు రెండు ప్రధాన సవాళ్లు ఉన్నాయి. పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసి 2029లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలి, అది ఆయనకు అగ్నిపరీక్ష అవుతుంది’’ అని హైదరాబాద్‌లోని సీనియర్ జర్నలిస్టు ఎస్‌కే జకీర్ అన్నారు.  మొదటి నుంచి కూడా అట్టడుగు స్థాయి నుంచి బలమైన పార్టీ నిర్మాణంపై కేసీఆర్ దృష్టి సారించ లేదు. 2014లో అధికారంలోకి రాకముందు తెలంగాణ సెంటిమెంట్ కార్డు పనిచేసి, సరైన క్యాడర్ బేస్ లేకుండానే ఆయన, ఆయన పార్టీ పలు ఎన్నికల్లో విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత క్రియాశీలక కమిటీలు, బలమైన స్థానిక నాయకులు లేకుండానే ఎమ్మెల్యేలను  ఏకైక ప్రతినిధులను చేశారు. వీరిలో చాలా మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. వారికి బీఆర్‌ఎస్‌తో ఎలాంటి భావోద్వేగ బంధం లేదు. వారు వెళ్లిపోతే పార్టీ మరింత సంక్షోభంలో పడిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలున్న సభలో బీఆర్‌ఎస్ 39 స్థానాలకు పడిపోయింది.
ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా, బీఆర్‌ఎస్‌ జీరోకి పడిపోయింది.      “పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్ మరియు బిజెపిల మధ్య పోరు జరిగింది. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  విజయం సాధిస్తే   మోడీ వేవ్ పని చేయడంతో కేంద్రంలో బిజెపి సంకీర్ణం గెలిచింది. ఈ దశలో ప్రజలను  ఒప్పించి ప్రజాభిమానం  గెలవడం బీఆర్‌ఎస్‌కు చాలా కష్టం అని జకీర్ అన్నారు. గత 15 రోజుల నుంచి కెసీఆర్ కొనసాగిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు వైఫల్యం చెందాయి. ఓ వైపు కెసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలు జరుపుతుంటే మరో వైపు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు యాదయ్య, గూడె మహిపాల్ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరారు. ఆత్మీయ సమ్మేళనాలు కెసీఆర్ కు రివర్స్ కావడం చర్చనీయాంశమైంది.