కేటీఆర్ సైలెంట్.. హరీష్ దూకుడు! కేసీఆర్ వ్యూహంలో బలిపశువా? 

కొన్ని రోజులుగా కేంద్రంతో పోరాటం చేస్తోంది టీఆర్ఎస్ సర్కార్. వరి కొనుగోళ్ల విషయంలో తాడోపేడో తేల్చుకుంటామంటోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆరుగురు మంత్రులు ఢిల్లీకి వెళ్లి.. కేంద్రమంత్రులతో చర్చలు జరుపుతున్నారు. వరి కొనుగోళ్లపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఢిల్లీలోనే ఉంటామంటున్నారు తెలంగాణ మంత్రులు. అటు కేంద్ర మంత్రులు కూడా సీరియస్ గానే స్పందిస్తున్నారు. ఢిల్లీకి వచ్చి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తెలంగాణ నేతలపై మండిపడుతున్నారు. కేసీఆర్ చేస్తున్న ఆరోపణలకు కౌంటరిస్తున్నారు.

కేంద్రం, రాష్ట్రం మధ్య కొన్ని రోజులుగా సాగుతున్న వార్ లో కొన్ని ఆసక్తికరమైన ఘటనలు జరుగుతున్నాయి. వరిపై తేల్చుకోవాలంటూ కేసీఆర్ మంత్రులను ఢిల్లీకి పంపింతే... ఆ బృందంలో కేటీఆర్ లేడు. టీఆర్ఎస్ శ్రేణులు కేంద్రానికి వ్యతిరేకంగా గ్రామాల్లో పోరాటం చేస్తుండగా... ఢిల్లీకి వెళ్లిన టీమ్ లో మాత్రం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే లేకపోవడం విచిత్రమే. అంతేకాదు వరి విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా మిగితా మంత్రులంతా మాట్లాడుతుండగా.. కేటీఆర్ మాత్రం నోరు విప్పడం లేదు. ప్రతి విషయంపై ట్విట్టర్ లో స్పందించే ఐటీ మినిస్టర్.. పాడి క్రాప్ డిసిప్యూట్ పై మాత్రం ఎలాంటి పోస్టులు పెట్టడం లేదు. కేటీఆరే కాదు ఎమ్మెల్సీ కవిత కూడా ఈ అంశంలో సైలెంట్ గానే ఉంటున్నారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. 

టీఆర్ఎస్ నేతలతో మాట్లాడిస్తూ.. తమ కుటుంబ సభ్యులను మాత్రం నోరు విప్పకుండా కేటీఆరే ప్లాన్ చేశారని అంటున్నారు. కేంద్రానికి తాము టార్గెట్ కావద్దనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులతో కేంద్రమంత్రి పియూష్ గోయెల్ కూడా దురుసుగానే వ్యవహరించారు. ఏం పనిలేక ఇక్కడికొట్టి టైమ్ వేస్ట్ చేస్తున్నారంటూ..ఓ రకంగా వాళ్ల పరువు పోయేలా కామెంట్ చేశారు. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తెలుసు కాబట్టే... కేటీఆర్ ఢిల్లీకి వెళ్లకుండా హైదరాబాద్ లో ఉండిపోయారనే టాక్ నడుస్తోంది. 

తాజాగా బుధవారం మంత్రి హరీష్ రావు వరి కొనుగోళ్ల విషయంలో స్పందించారు. కేంద్రమంత్రి పియూష్ గోయేల్ కామెంట్లకు కౌంటరిచ్చారు. 70 లక్షల రైతుల ఆత్మగౌరవాన్ని కేంద్రమంత్రి దెబ్బతీశారన్నారు. రైతుల సమస్యలపై వచ్చిన మంత్రులను కలవడం లేదని మండిపడ్డారు.రైతుల ఓట్లు కావాలి కానీ.. రైతుల భాద పట్టించుకోరా? అని హరీష్‌రావు ప్రశ్నించారు. కేంద్రమంత్రి గోయల్ మాట్లాడేవన్నీ అబద్ధాలేనన్నారు. పంజాబ్‌లో ఒడ్లు కొన్నట్లే.. తెలంగాణలో కొనమని ఆడిగామన్నారు. పంజాబ్‌లో కొని, ఇక్కడ ఎందుకు కొనరని ప్రశ్నించారు. యాసంగిలో ఓడ్లు కొంటారా కొనరా? అని నిలదీశారు. కరువు వస్తే రాష్ట్రాల దగ్గర ఉన్న ధాన్యం బలవంతంగా తీసుకుంటున్నారని, ఎగుమతి, దిగుమతులు కేంద్రం పరిధిలో ఉందన్నారు. రాష్ట్రాలపై బురద చల్లితే ఊరుకోమని హరీష్‌రావు అన్నారు.

అయితే కేంద్రాన్ని టార్గెట్ చేసే విషయంలో కేటీఆర్ సైలెంట్ గా ఉంటుండగా.. హరీష్ రావు దూకుడుగా ఉండటం కూడా కేసీఆర్ వ్యూహంలో భాగమంటున్నారు. సివిల్ సప్లయ్, వ్యవసాయ శాఖ మంత్రులు ఉన్నా హరీష్ రావుతో కేంద్రాన్ని తిట్టిస్తున్నారని చెబుతున్నారు. హరీష్ రావుతో మాట్లాడిస్తే.. బీజేపీకి అతనే టార్గెట్ అయ్యేలా గులాబీ బాస్ స్కెచ్ వేశారంటున్నారు. రేపు బీజేపీతో సంబంధాలు పూర్తిగా తెగిపోతే... ఇప్పుడు గట్టిగా మాట్లాడిన నేతలే ఇబ్బందులు పడతారని, తన కొడుకు-కూతురు మాత్రం సేఫ్ గా ఉంటారనేది కేసీఆర్ ఆలోచన అంటున్నారు.  ఓ రకంగా హరీష్ రావును ఇరికించేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.