మతమార్పిడి నిరోధక చట్టం.. కమలం కంటే ‘రెండాకులు’ఎక్కువే..

మరో బీజేపీ పాలిత రాష్ట్రం మతమార్పిడి నిరోధక బిల్లు తీసుకొచ్చింది.  ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు మతమార్పిడి నిరోధక చట్టాలు చేసి అములు చేస్తున్నాయి. ఇపుడు ఆ జాబితాలో మరో  బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటక  చేరింది. అయితే,దేశాన్ని హిందూ రాష్రం బగా ప్రకటించాలని చూస్తున్న బీజేపీ, పాలిత రాష్ట్రాలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు.ఇదేమి విచిత్రం కాదు. ఉహించనిదీ కాదు.

నిజానికి ఇది ఎప్పుడో జరగవలసిందే కానీ, శాసన మండలిలో మెజారిటీ లేక పోవడం వలన కర్ణాటక ప్రభుత్వం ఇంతవరకు కొంత జాప్యం చేసింది. ఇటీవల జరిగిన మండలి ఎన్నికల్లో పెద్దల సభలో అధికార బీజేపీకి ఆధిక్యత రావడంతో జాప్యం చేయకుండా మతమార్పిడి నిరోధక బిల్లు మంగళవారం(డిసెంబర్ 21) శాసనసభలో  ప్ర‌వేశ‌పెట్టింది. అయితే బీజేపే పాలిత రాష్ట్రాల కంటే, చాలా చాలాముందుగా 2002లోనే అంటే, నిండా రెండు దశాబ్దాల ముందుగా తమిళనాడు ప్రభుత్వం, మత మార్పిడి నిరోధక చట్టాని తీసుకొచ్చింది. కన్యాకుమారి, రామనాథపురం జిల్లాలలో జరిగిన మత ఘర్షణలు నేపధ్యంగా అప్పటి  ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చించి. 

అయితే అప్పుడు కూడా, ఇప్పుడు కర్ణాటకలో మతమార్పిడుల నిరోధక బిల్లును వ్యతిరేకించిన విధంగానే, కాంగ్రెస్, డిఎంకే పార్టీల సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అయినా, బిల్లు సభలో భారీ మెజారిటీ (140/72)తో ఆమోదం పొందింది. ఆ సందర్భంలో విపక్షాల, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సభ్యుల విమర్శలకు సమాధానం చెపుతూ,ముఖ్యమంత్రి జయలలిత, ‘మత మార్పిడులు భారత దేశానికి హానికరం. నాకే అధికారం ఉంటే ఒక్కక్షణం ఆలోచించకుండా, మత మార్పిడులను అడ్డుకుంటాను’  అంటూ మహాత్మా గాంధీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. నిజానికి తమిళ నాడు చట్టం అంతగా కోరలున్న చట్టం కాదు. చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా  కన్యాకుమారి, రామనాథపురం జిల్లాలలో ఈరోజుకు కూడా ఫిషర్మెన్ (మత్సకారుల)పేదరికాన్ని పావుగా చేసుకుని మత మార్పిడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే, నాస్తిక భావజాలం పునాదిగా ఏర్పాడిన ద్రవిడ పార్టీలు (డిఎంకే అన్నా డిఎంకే) రాజకీయ అధిపత్యం కొనగుతున్న రాష్ట్రంలో  మతమార్పిడి నిరోధక చట్టం, అది కూడా , హిందుత్వ  భావజాల బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే  రెండు దశాబ్దాల ముందు రావడం నిజంగా కొంత ఆశ్చర్యకరమే.. అయితే, పరిస్థితులు అలా వచ్చాయి. అందుకే చట్టం చేయవలసి వచ్చిందని విశ్లేషకులు అంటారు.  

కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన మత స్వేచ్ఛ హక్కు బిల్లు 2021, ఇంతవరకు ఇతర రాష్ట్రాలు తెచ్చిన చట్టాలకు భిన్నమైనది, కఠినమైనది అంటున్నారు. అందుకే, విపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు, బిల్లును వ్యతిరేకిస్తున్నాయి, బిల్లుకు డిసెంబర్ 20 (సోమవారం) కర్ణాటక మంత్రి మండలి ఆమోదం తెలిపింది .అనంత‌రం అసెంబ్లీ ముంద‌కు వ‌చ్చింది. బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిడిల‌ను నిషేధించేందుకు ఈ బిల్లును ప్ర‌భుత్వం తీసుకొచ్చింది.అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు, కార్యకర్తలు, పౌరులు మరియు న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ బిల్లుని ఒక‌సారి పరిశీలిస్తే, ఈ చట్టం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో ప్రవేశపెట్టిన వాటి కంటే మరింత కఠినమైంది. మ‌త‌మార్పిడిల‌కు పాల్ప‌డితే కర్ణాటకలో కనీస శిక్ష మూడు నుండి ఐదు సంవత్సరాలతో పాటు… కనిష్టంగా రూ.25,000 జరిమానా విధించబడుతుంది. ఉత్తరప్రదేశ్‌లో కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.15,000 జరిమానా మాత్ర‌మే విధించ‌నున్నారు. వివాహం ద్వారా కానీ వివాహం తర్వాత మత మార్పిడిని నిషేధించడంతో పాటు, కొత్త బిల్లు ‘వివాహ వాగ్దానం’ ద్వారా మతవాగ్దానం’ ద్వారా మత మార్పిడిని కూడా నిషేధిస్తుంది.కర్ణాటక మతస్వేచ్ఛ హక్కు బిల్లులోని సెక్షన్ 3 ప్రకారం ఎవరైనా “ప్రత్యక్షంగా లేదా ఇతరత్రా ఒక మతం నుండి మరొక వ్యక్తిని మతం మారడం లేదా మార్చడానికి ప్రయత్నించడం ద్వారా జరిమానా విధిస్తుంది. బలవంతం, మోసపూరిత మార్గాల ద్వారా లేదా వివాహ వాగ్దానం లాంటి వాటి ద్వారా మతమార్పిడులకు సహకరించే కుట్ర చేసిన వారికి కూడా జరిమానా విధించబడుతుందని బిల్లు పేర్కొంది. ఇది బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ఇలాంటి ఇతర చట్టాలకు భిన్నంగా ఉంది.

కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు ప్రకారం.. సామూహిక మతమార్పిడులకు పాల్పడే వారికి మూడు నుంచి పదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. షెడ్యూల్డ్ కులాల వ్యక్తి మైనారిటీ రిలిజియన్ గ్రూపులోకి మారితే అతను రిజర్వేషన్లతో సహా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను కోల్పోతాడు. కాగా, ఈ బిల్లును రాష్ట్రంలోని క్రిష్టియన్ సంస్థల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది.