దేశంలో మ‌ళ్లీ లాక్‌డౌన్‌!.. ప్ర‌ధాని మోదీ కీలక మీటింగ్‌..

ఇండియాలో ఒమిక్రాన్ కేసులు 215కి చేరాయి. 15 రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు క‌ల‌వ‌ర పెడుతున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో అత్యధికంగా 57 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా.. మహారాష్ట్ర 54, తెలంగాణ 25, కర్ణాటక 19, రాజస్థాన్‌ 18, కేరళ 15, గుజరాత్‌లలో 14 కేసులు రిజిస్ట‌ర్ అయ్యాయి. కశ్మీర్‌లోనూ మూడు కేసులు వ‌చ్చాయి. యూపీ, ఒడిశా, ఏపీలలో రెండు కేసులు వచ్చాయి. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, చండీగఢ్‌, లద్దాఖ్‌ లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇలా దేశ‌వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టం.. త్వ‌ర‌లోనే క్రిస్‌మ‌స్‌, న్యూఇయ‌ర్ వేడుక‌లు ఉండ‌టంతో కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది. ఇప్ప‌టికే రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌గా.. మ‌రోవైపు, గురువారం ప్ర‌ధాని మోదీ కీల‌క స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ భేటీలో మ‌రోసారి లాక్‌డౌన్ విధించే అంశాన్ని ప‌రిశీలిస్తారా? లేక‌, క్రిస్‌మ‌స్‌కు ఆంక్ష‌లు పెట్టి.. న్యూఇయ‌ర్‌కు 24గంట‌ల పాటు లాక్‌డౌన్ పెడ‌తారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. 

ఇప్ప‌టికే ఒమిక్రాన్‌పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. డెల్టా రకం కంటే కొత్త వేరియంట్‌కు 3 రెట్లు ఎక్కువగా వ్యాపిస్తున్న‌ట్టు హెచ్చరించింది. కొవిడ్‌ వార్‌ రూమ్‌లను మ‌ళ్లీ యాక్టివ్ చేయాల‌ని.. కేసులు పెరిగితే జిల్లా, స్థానిక స్థాయిల్లో కఠిన చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించింది. 

ఒమిక్రాన్ క‌ట్ట‌డికి రాష్ట్రాల‌కు కేంద్రం ప‌లు సూచ‌న‌లు చేసింది. పరిస్థితులను బ‌ట్టి రాత్రి కర్ఫ్యూ విధించడం,  ప్రజలు గుమిగూడకుండా చూడటం, వివాహాలు, అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్యను పరిమితం చేయడం, పరీక్షలు పెంచడం లాంటివి చేయాలని తెలిపింది. ఇదే స‌మ‌యంలో గురువారం ప్ర‌ధాని మోదీ కీల‌క స‌మీక్ష నిర్వ‌హించ‌నుండ‌టంతో.. ఈ క‌ఠిన నిబంధ‌న‌లే కేంద్రం అధికారికంగా అమ‌లు చేస్తుందా?  పాక్షిక లాక్‌డౌన్ లాంటి చ‌ర్య‌ల‌కు దిగుతుందా?  క్రిస్‌మ‌స్‌, న్యూఇయ‌ర్ వేడుక‌ల్లో కేసులు పెర‌గ‌కుండా ఆంక్ష‌లు విధిస్తుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. గురువారం మ‌ళ్లీ పీఎం మోదీ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడ‌తారా? మ‌రోసారి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేస్తారా?