స్పీడ్ పెంచిన ష‌ర్మిళ‌.. జ‌గ‌న్ రాజ‌కీయ చాప్ట‌ర్ క్లోజ్‌?

మూలిగే న‌క్క‌పై తాడిపండు ప‌డిన చందంగా త‌యారైంది వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిస్థితి.  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల్లో వైఎస్ పై ఉన్న అభిమానాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారు.  2014 ఎన్నిక‌ల్లో విఫ‌ల‌మైనా.. 2 019 ఎన్నిక‌ల్లో  ఆయన నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది.  

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌ర‌హాలో పాల‌న‌సాగిస్తాన‌ని సీఎం పీఠాన్ని అధిరోహించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకోలేక పోయారు. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో జగన్ హయాంలో ఏపీ ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డ్డారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎప్పుడు దిగిపోతుందా అని ఎదురుచూస్తూ వ‌చ్చారు.  ఏ వ‌ర్గానికీ వైసీపీ ప్ర‌భుత్వంలో మేలు జ‌ర‌గ‌లేదు. ఏ వర్గమూ వైసీపీ ప్రభుత్వ హయాంలో సంతృప్తిగా లేదు.  జగన్ ప్రభుత్వ వేధింపులకు గురి కాని వర్గమే లేదంటే అతిశయోక్తి కాదు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో రైతుల‌కు, పేద విద్యార్థుల‌కు మేలు జ‌రిగింది. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం రైతుల అభివృద్ధిని పూర్తిగా ప‌క్క‌న‌ పెట్టేసింది. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో వేగంగా ముందుకు సాగిన ప్రాజెక్టుల నిర్మాణాలు జ‌గ‌న్ హ‌యాంలో ప‌డ‌కేశాయి. వైఎస్ త‌ర‌హాలో పాల‌న అందిస్తాడ‌ని సీఎం కుర్చీఎక్కిస్తే.. జ‌గ‌న్ మాత్రం కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కే  తన ఐదేళ్ల అధికారాన్ని ప‌రిమితం చేశారు. దీంతో  ప్ర‌జ‌లు 2024 ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా గ‌ట్టి బుద్ధి చెప్పారు. నీ సేవలింక చాలని ఇంటికి పంపేశారు.

తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టి చూస్తే.. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని చూసి వైసీపీకి ఓట్లువేసిన వారు చాలా త‌క్కువ మంది అనే చెప్పాలి.  జ‌గ‌న్ గెలుపులో కీల‌క భూమిక పోషించింది ఏపీలోని వైఎస్ అభిమానులేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. వైఎస్ త‌ర‌హాలో పాల‌న సాగిస్తాడ‌ని భావించి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సీఎం పీఠంపైకి ఎక్కించారు. కానీ, వైఎస్ లెగ‌సీని వాడుకున్న జ‌గ‌న్‌.. ఆయ‌న త‌ర‌హాలో   పాల‌న సాగించ‌లేదు. అయితే, తాజా ఓట‌మి త‌రువాత అస‌లు విష‌యాన్ని గుర్తించిన జ‌గ‌న్‌, మ‌ళ్లీ వైఎస్ జ‌పం చేసేందుకు సిద్ధ‌మ‌యిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మ‌యంలోనే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ జీవితానికి చెక్ పెట్టేందుకు ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల రంగంలోకి దిగారు. తాజాగా వైఎస్ జ‌యంతిని జ‌రిపే బాధ్య‌త‌ను ఆమె భుజానికెత్తుకున్నారు. వైఎస్ బిడ్డ‌గా ఆయన జ‌యంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన షర్మిల  విజ‌య‌వాడ‌లో ఈనెల 8న జ‌రిగే వైఎస్ఆర్‌ 75వ జ‌యంతి వేడుక‌ల‌కు రావాలంటూ తెలంగాణ, ఏపీలోని కాంగ్రెస్ నేత‌ల‌ను  స్వ‌యంగా వెళ్లి ఆహ్వానిస్తున్నారు. ఈ ప‌రిణామం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల‌కు మింగుడుప‌డ‌ని అంశంగా మారింది. 

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైఎస్ ష‌ర్మిల ఇద్ద‌రూ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వార‌స‌త్వ‌మే. వైఎస్ మరణం తరువాత కాంగ్రెస్ పార్టీని వీడిన జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని  ఏర్పాటు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన జగన్, 2019 ఎన్నికల్లో వైఎస్ అభిమానుల సహకారంతో పాటు తన చెల్లి షర్మిళ, తల్లి విజయమ్మల ప్రచారంతో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత   కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ప్రతిపక్ష నేతలను, తన విధానాలను వ్యతిరేకించిన ప్రజలను జ‌గ‌న్‌ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మను అవమానకర రీతిలో పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేశాడు. దీంతో వైఎస్ అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. జగన్ మోహన్ రెడ్డికి దూరమైన షర్మిల.. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి కొన్నిరోజులు నడిపినప్పటికీ.. ఆ తరువాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ కాంగ్రెస్ పగ్గాలను చేపట్టారు. అప్పటి నుంచి జగన్ మోహన్ రెడ్డిపై ఆమె విమర్శలు చేస్తూ వచ్చారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌డ‌ప ఎంపీగా పోటీ చేసిన ష‌ర్మిల‌.. ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌ర‌హా పాల‌న జ‌గ‌న్ కు చేత‌కాద‌ని.. వైఎస్ త‌ర‌హా పాల‌న మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్య‌మ‌వుతుంద‌ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లారు. దీనికి తోడు విజ‌య‌మ్మ‌ సైతం ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డంతో వైఎస్ అభిమానులు చాలా వరకూ వైసీపీకి దూర‌మ‌య్యారు. ఫ‌లితంగా జ‌గ‌న్ భారీ ఓట‌మిని చ‌వి చూశారు.

ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఇచ్చిన షాక్ నుంచి తేరుకుంటున్న జ‌గ‌న్‌కు ష‌ర్మిల మ‌రోషాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మయ్యారు. జూలై 8న విజ‌య‌వాడ వేదిక‌గా వైఎస్  జ‌యంతి వేడుక‌ల‌ను భారీ ఎత్తున నిర్వ‌హించేందుకు వైఎస్ ష‌ర్మిల‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్  నేత‌ల‌తో పాటు.. జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలు కూడా హాజరవ్వబోతున్నట్లు తెలుస్తోంది.  అదే జ‌రిగితే వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీవైపు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని వైసీపీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఇప్ప‌టికే వైఎస్ త‌ర‌హా పాల‌న ఏపీలో రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్య‌మ‌వుతుంద‌ని ష‌ర్మిల ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లారు. ఇప్పుడు వైఎస్ జ‌యంతిని పెద్ద ఎత్తున నిర్వ‌హించ‌డం ద్వారా వైఎస్ అభిమానులు పూర్తిగా కాంగ్రెస్ వైపు మ‌ళ్ల‌డం ఖాయ‌మ‌ని, త‌ద్వారా రాబోయే కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రాజ‌కీయ స‌న్యాసం త‌ప్ప‌ద‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా జ‌రుగుతుంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కొంద‌రు వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకోసం ఇత‌ర పార్టీల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. మొత్తం మీద వైఎస్ జయంతి కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడం ద్వారా షర్మిల తండ్రి లెగసీని పూర్తిగా జగన్ కు దూరం చేయడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే రాజకీయంగా జగన్ చాప్టర్ క్లోజ్ అయినట్లేనని అంటున్నారు.