వైసీపీకి అధికారం.. పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టే!!

 

చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రజావేదికను జగన్ సర్కార్ కూల్చివేయడంతో.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

వైసీపీ నేత విజయ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ మీద విమర్శలు గుప్పించారు. "ప్రజావేదిక షెడ్డు కూల్చివేతను చూసేందుకు వచ్చిన ప్రజలకున్న అవగాహన కూడా టీడీపీ నేతలకు లేకపోవడం దురదృష్టం. రాజధాని కోసం మా నుంచి 33 వేల ఎకరాలు సేకరించారు. ప్రజా వేదికను కరకట్టకు బదులుగా ఆ భూముల్లోనే కట్టి ఉంటే ఇవాళ ప్రజాధనం వృధా అయ్యేది కాదు కదా అని ప్రశ్నించారు." అని ఎద్దేవా చేసారు.

మరో ట్వీట్ లో "చంద్రబాబు ఐదేళ్లుగా నివాసం ఉంటున్న అక్రమ నిర్మాణం లింగంనేని ఎస్టేట్ నుంచి తక్షణం ఖాళీ చేయాలి. అది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే కట్టారుగా అనే ముర్ఖపు లాజిక్కులతో తప్పించుకోలేరు. నదీ గర్భంలో నిర్మించిన భవనమని తేలాక కూల్చివేయడం తప్ప వేరే పరిష్కారమేముండదు." అని పేర్కొన్నారు.

విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలపై తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. నీతినిజాయతీ ఉన్నవాళ్లు తమ ఇంటి నుంచే ప్రక్షాళన మొదలుపెడతారని, మీకు అటువంటి నీతి లేదన్న విషయం ప్రజావేదిక కూల్చివేతతో స్పష్టమవుతోందని విమర్శించారు. ఒకవేళ మీకు అలాంటి నీతి ఉంటే ముందు ఇడుపులపాయలో ఉన్న అక్రమకట్టడాలపై చర్యలు తీసుకోండంటూ సవాల్ విసిరారు.

"ప్రజావేదికను కూల్చుతుంటే చూడ్డానికి వచ్చిన ప్రజలు ఏమనుకున్నారో నువ్వు విన్నట్టు లేవు, పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టు వైసీపీకి అధికారం ఇచ్చి తప్పుచేశాం అనుకుంటున్నారు. వైఎస్ పాలనలో అక్రమాలపై మాట్లాడుతుంటే విజయసాయిరెడ్డికి మూర్ఖపు లాజిక్ లా ఉందట! మీ ముఖాన దొంగ అని ముద్రపడింది కాబట్టి అందరికీ అదే ముద్రవేయాలనుకుంటున్న మీరే మూర్ఖులు!" అంటూ తీవ్రస్థాయిలో వర్ల రామయ్య ధ్వజమెత్తారు.