రోడ్డుపైనే తిట్టుకున్న కొడాలి నాని అనుచరులు

మొన్నామధ్య వచ్చిన ‘జాతిరత్నాలు’ సినిమాలో తన నాయకుడు కేక్ కట్ చేసి, తనకు కాకుండా మరొకరికి పెట్టాడన్న కోపంతో ఒక కార్యకర్త తన నాయకుడినే కత్తితో పొడుస్తాడు. ఇంత రేంజ్‌లో జరగలేదుగానీ, తమ నాయకుడు తమకు కాకుండా ఇతరులకు ప్రాధాన్యం ఇచ్చాడన్న కోపంతో రోడ్డు మీదే గొడవపడి, తిట్టుకున్న సంఘటన గుడివాడ నియోజకవర్గంలో జరిగింది. గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొడాలి నాని శనివారం నాడు తన అనుచరులతో కలసి ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని గుడ్లవల్లేరుకు చేరుకున్నారు. ఆ ఊళ్ళో వున్న వైసీపీకి రెండు వర్గాలు వున్నాయి. వర్గం నంబర్ వన్‌కి చెందిన వ్యక్తులు కొడాలి నాని ప్రచారం చేస్తున్న వాహనం మీద ఎక్కారు. అది చూసి వర్గం నంబర్ టూకి చెందిన వ్యక్తులకు కోపం వచ్చింది. మమ్మల్ని కాకుండా వాళ్ళని వాహనం మీద ఎక్కించుకుంటారా అని కొడాలి నానిని నిలదీశారు. దాంతో ఆ వర్గానికి, ఈ వర్గానికి మధ్య వాగ్వాదం జరిగింది. తిట్టుకోవడం వరకు విషయం వెళ్ళింది. వాళ్ళు అలా తిట్టుకుంటూ వుండగానే, సమస్యని పరిష్కరించాల్సిన కొడాలి నాని చక్కగా తన కారును తానే డ్రైవ్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. దాంతో రెండు వర్గాలూ షాకైపోయి నోళ్లు మూసుకున్నారు.