మంత్రి అమర్‌నాథ్ చొరవ.. 50 ఎకరాలు స్వాహా!

తిరుపతి విమానాశ్రయం పక్కనే వున్న 50 ఎకరాల ఏపీఐఐసీ భూమిని మంత్రి అమరనాథ్ రియల్‌ఎస్టేట్ పరం చేశారు. అయినవారికి లబ్ధిని చేకూర్చడం కోసం నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఇష్టారాజ్యంగా ఉత్తర్వులు మార్చేసి భూమిని గుటకాయస్వాహా చేసేశారు. పారిశ్రామిక అవసరాలకు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం తిరుపతిలో కేటాయించిన 50 ఎకరాల భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటామని దాన్ని రాయితీ ధరపై తీసుకున్న కంపెనీ కోరితే గుడివాడ అమర్‌నాథ్ ఆశీస్సులతో ప్రభుత్వం ఓకే చెప్పింది. ఆ భూమిని సదరు సంస్థకి కేటాయించింది పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమేనని ఏపీఐసీసీ మొత్తుకుంటున్నా అమర్‌నాథ్ వినలేదు. పాత ఉత్తర్వులను రివర్స్ చేసి, ఏ సంస్థకు పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించారో అదే సంస్థ అక్కడ హోటళ్ళు, విల్లాలు కట్టుకోవడానికి అనుమతి వచ్చేలా చేశారు. అంతే కాదు, సదరు సంస్థ నుంచి ఏపీఐసీసీకి రావల్సిన 32 కోట్ల రూపాయల బకాయిలను కూడా రద్దు చేశారు. మొత్తం ఈ వ్యవహారంలో 35 కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.