జనం లేక పలుచన.. పిఠాపురం జగన్ సభ

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణంలో అందరి దృష్టీ పిఠాపురంపైనే ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ కూటమి బ లపరిచిన అభ్యర్థిగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీ దారులు ఇద్దరూ కూడా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. పిఠాపురంలో విజయం కోసం ఇరు పార్టీలూ హోరాహోరీ తలపడుతున్నాయి. 

పిఠాపురంలో విజయాన్ని పవన్ కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాగే ఎలాగైనా పవన్ కు ఓడించాలని జగన్ కంకణం కట్టుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా   పిఠాపురంపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. పవన్ కు మద్దతుగా మెగా హీరోలతో పాలు పలువురు సినీ ప్రముఖులు ప్రచారం చేశారు. ఇక వైసీసీ అధినేత జగన్ అయితే ప్రచారం ముగిసే  చివరి రోజున పిఠాపురంలో బహిరంగభలో ప్రసంగించారు.  ఆ సందర్భంగా ఆయన రాజకీయాల కంటే పవన్ వ్యక్తిగత జీవితాన్నే టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమౌతోంది. ఆయన తన ప్రసంగంలో పవన్ వివాహాలపై వ్యాఖ్యలు చేయడమే కాకుండా  కర్లను మార్చేసినట్లు భార్యలను మార్చేసే జగన్ వద్దకు మహిళలు ఎవరైనా వెళ్లగలరా అంటూ చౌకబారు వ్యాఖ్యలు చేశారు.  జగన్ వ్యాఖ్యల పట్ల మహిళలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక జగన్ తన ప్రసంగంలో పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే ఆమెను ఉప ముఖ్యమంత్రిని చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై జనం నవ్వి పోతున్నారు. ఆయన ఏ నియోజకవర్గంలో ప్రచారానికి వెడితే ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తాను, ఉప ముఖ్యమంత్రిని చేస్తాను అంటూ చేస్తున్న ప్రకటనలపై నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. గత ఎన్నికలలో మంగళగిరిలో ఆళ్లను గెలిపిస్తే మంత్రిని చేస్తానన్న జగన్ ఆ మాట నిలబెట్టుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే కుప్పంలో ప్రచారం నిర్వహిస్తూ జగన్ కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ చేసిన ప్రకటనపై కూడా నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. కుప్పంలో వైసీపీ గెలిస్తే కుప్పం ఎమ్మెల్యే మంత్రి అంటున్నారు. చంద్రబాబు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు కదా అని గుర్తు చేస్తున్నారు. అయినా జగన్ ఎవరినైనా మంత్రిని చేయడానికైనా, ఉప ముఖ్యమంత్రిని చేయడానికైనా ముందు ఆయన, ఆయన పార్టీ ఈ ఎన్నికలలో విజయం సాధించాలి కదా అని ప్రశ్నిస్తున్నారు.  గత ఎన్నికలలో కూడా జగన్ భీమవరంలో పవన్ ను ఓడిస్తే అప్పుడు అక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ ను మంత్రిని చేస్తానని ప్రకటించారు.  చేశారా అంటున్నారు.  జగన్ వాగ్దానాలు, హామీలపై జనంలో నమ్మకం పోవడానికి తన ఐదేళ్ల హయాంలో ప్రతి విషయంలోనూ మాట తప్పి, మడమ తిప్పడమే కారణమని అంటున్నారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసే చివరి రోజున వ్యూహాత్మకంగా పిఠాపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన జగన్ ప్రసంగించారు. అయితే ఆ సభకు జనం పలుచగా ఉండడాన్ని బట్టి అక్కడ వైసీపీ శ్రేణులే చేతులెత్తేశారని అర్ధమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.