ఏపీలో89శాతం పోలింగ్ జరిగే అవకాశం.. పరిశీలకుల అంచనా!

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం (మే13) జరిగే పోలింగ్ కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది.  4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు తమ  ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందు కోసం రాష్ట్రంలో మొత్తం 46వేల 389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో దాదాపు సగానికి పైగా పోలింగ్ కేంద్రాలలో   వెబ్‌ కాస్టింగ్ నిర్వహిస్తారు.

సోమవారం(మే 13) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. నిర్ణీత సమయంలోగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలైన్ లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది.  వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయటంతో పాటు  తాగునీటి సదుపాయం, ఫస్ట్ ఎయిడ్  మెడికల్ కిట్లను ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచనుంది. పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు   ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.  

3 లక్షల 30వేల మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తారు. భద్రత కోసం లక్షా 14వేల మంది పోలీసు సిబ్బందిని నియోగిస్తున్నది.  వీరికి అదనంగా 10 వేల మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బీఎల్ఓలు విధుల్లో ఉంటారు.  ఇక రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2, 387 మంది పోటీలో ఉన్నారు. స్వతంత్రులు, ఇతర పార్టీలూ ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా విపక్ష తెలుగుదేశం కూటమి, అధికార వైసీపీ మధ్యనే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇలా ఉండగా మున్నెనడూ లేని విధంగా ఈ సారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై దేవ వ్యాప్తంగా అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అలాగే ఏపీ బయట ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర వ్యాపకాలు చేసుకుంటున్న వారు ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ఓటు హక్కును వినియోగించుకు తీరాలన్న పట్టుదల కనిపిస్తున్నారు. దీంతో దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచీ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కు ఓటర్లు వస్తున్నారు. దీంతో ఈ సారి రాష్ట్రంలో ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 2019 ఎన్నికలలో రాష్ట్రంలో 79.84 శాతం ఓటింగ్ నమోదు కాగా ఈ సారి అది 89శాతం వరకూ ఉండొచ్చన్నది అంచనా.