స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ నిధులు గోల్ మాల్.. పవన్ సమీక్షలో వెలుగులోకి!

ఆర్థిక అరాచకత్వంలో వైసీపీ అధినేత జగన్ కు సాటి రాగలవారెవరూ ఉండరు.  కేంద్ర నిధులను సైతం పక్కదారి పట్టించి పబ్బంగడుపుకుని రాష్ట్రాన్ని దివాళా అంచుకు చేర్చిన ఘనత జగన్ ది. అధికారంలో ఉండాగా ఇష్టారాజ్యంగా వ్యవహరించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఆయనకు ఇటీవలి ఎన్నికలలో జనం కర్రు కాల్చి వాత పెట్టిన చందంగా ఘోర పరాజయాన్ని కట్టబెట్టారు. సరే అధికారంలో ఉండగా జగన్ ఆర్థిక అరాచకత్వం గురించి కొంతే బయటకు తెలిసింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత... ఆయన లీలలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. 

వాటిలో స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ లో నిధుల గోల్ మాల్ ఒకటి. ఆ కార్పొరేషన్ లో  నిధులను హారతి కర్పూరంలా ఎలా కరిగించేశారు. ఎటు మళ్లించారు. అన్న వివరాలను ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి, పంచయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.  మంగళగిరిలోని తన నివాసంలో  పవన్ కల్యాణ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్ కు ఉన్న నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో  సమీక్షించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై మంత్రి అధికారులను ఆరా తీశారు.  2020-21లో రూ.728.35 కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించింది. 2021-22లో రూ.508 కోట్లు ఖర్చు చేశారు. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.1066.36 కోట్లు ఖాతాలో ఉన్నాయి. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యేనాటి కార్పొరేషన్ ఖాతాలో రూ.3 కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డుల్లో నమోదు అయింది. దీనిపై వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.   ఆ ఆర్థిక సంవత్సరంలో కేంధ్ర ప్రభుత్వం నుంచి రూ.70 కోట్లు నిధులు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు నిధులు అందించింది. రూ.46 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటిపై వచ్చిన వడ్డీతో రూ.239 కోట్లు నిధులు సమకూరాయి. ఖర్చు రూ.209 కోట్లు మేర చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ మిగిలినవి రూ.7.04 కోట్లు మాత్రమే. 

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సక్రమంగా వినియోగమయితేనే ఈ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలు అందుకోగలమని పవన్ పేర్కొన్నారు.  దేశ ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  ప్రజారోగ్యం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకువచ్చారు..  అందులో భాగంగానే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటైంది. కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడం, ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తున్నా వినియోగించకుండా- ఆపైన ఇతర అవసరాలకు మళ్లించడం ద్వారా గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని   పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2092 కోట్లు నిధి ఉంటే... ఇప్పుడు జీతాలకు సరిపడా నిధులు మాత్రమే ఖాతాలో ఉండే  పరిస్థితి ఎందుకు వచ్చింది? అని అధికారులను ప్రశ్నించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లో నిధుల మళ్లింపుపై మరింత లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నిధులు ఎటు మళ్లించారో, ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో కూడా తెలియచేయాలని, గత అయిదేళ్లలో ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా చర్చిద్దామని పవన్ అన్నారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎమ్.డి., ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.