ఒక్కొక్కరూ కాదు.. మందలు మందలుగా.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి!?

మగధీర సినిమాలో ఓ  డైలాగ్ ఉంటుంది.. ఒక్కొక్కర్నీ కాదు షేర్ ఖాన్ అందర్నీ ఒకే సారి పంపించు అని.. బీఆర్ఎస్ పరిస్థితి చూస్తుంటే.. ఆ డైలాగ్ రివర్స్ లో గుర్తుకు వస్తోంది.   ఒక్కరొక్కరుగా కాదు కేసీఆర్ మందలు మందలుగా వెళ్లిపోతాం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారా అనిపించక మానదు.  బీఆర్ఎస్ నుంచి వలసలు నిన్నమొన్నటి వరకూ ఒక్కొక్కరుగా అన్నట్లుగా సాగింది. అయితే ఇప్పుడు మాత్రం ఆ వలసల వేగం పెరిగింది.

ఒక్కొక్కరిగా కాదు మందలు మందలుగా పార్టీ మారేందుకు ఉత్సాహం చచూపుతున్నారు. కాంగ్రెస్ హై కమాండ్ నుంచి రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ రావడంలో ఆయన ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచారు. గతంలో కేసీఆర్ ఏ విధంగానైతే విపక్ష పార్టీల నుంచి వలసలను ప్రొత్సహించి వాటిని బలహీన పరిచారో ఇప్పుడు అదే రీతిలో రేవంత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక విషయంలో వేగం పెంచారు.   ఏఐసీసీ పెద్దలతో  బుధవారం (జూన్ 26) భేటీ అయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోయే ఎమ్మెల్యేల జాబితాను ఢిల్లీ పెద్దలకు అందించారు. ఎమ్మెల్యేల చేరిక సమయంలో పార్టీ నేతల్లో ఎలాంటి అసంతృప్తి లేకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డికి హై కమాండ్ సూచించింది. గందరగోళానికి తావు లేకుండా చేరికలను డీల్ చేయాలని చెబుతూనే.. పార్టీ  సంస్థాగతంగా  బలపడేందుకు చేరికలు తప్పనిసరి అని ఏఐసీసీ నేతలు రేవంత్ కు చెప్పారు. అదే సమయంలో సీనియర్లకు ప్రాధాన్యతను తగ్గించవద్దని సలహా ఇచ్చారు. ఇప్పటికే తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేసి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడిన జీవన్ రెడ్డిని హైకమాండ్ బుజ్జగించింది. ఆయన ప్రాధాన్యతకు,  సీనియారిటీకి ఎలాంటి ఇబ్బందీ కలగదని విస్ఫష్టంగా చెప్పింది.  రాష్ట్రంలో బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే చేరికలకు ఓకే చెబుతున్నామని హైకమాండ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు, శ్రేణులకు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చింది. 

ఈ నేపథ్యంలోనే రానున్న అసెంబ్లీ సమావేశాల్లోకు ముందు బీఆర్ఎస్  నుంచి ఓ పదకొండు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు  రేవంత్ రెడీ అయిపోయినట్లు కాంగ్రెస్  వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ పదకొండు మందీ రేవంత్ లోకి టచ్ లోకి వచ్చారనీ, ఎప్పుడు రేవంత్ పిలుపు వస్తే అప్పుడు కారు దిగి చేయందుకోవడానికి వీరు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అలా కాంగ్రెస్ లోకి చేరడానికి సిద్ధంగా ఉన్న 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జాబితాను రేవంత్ రెడ్డి హైకమాండ్ కు రేవంత్  ఇచ్చారని అంటున్నారు. అయితే ఆ పదకొండు మంది ఎవరు అన్న విషయంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఇక పరిశీలకులు అయితే.. కేసీఆర్ నిర్వహించిన అత్యవసర సమావేశానికి డుమ్మా కొట్టిన ఐదుగురు ఎమ్మెల్యేల పేర్లు చెబుతున్నారు. ఈ ఐదుగురు కాకుండా మిగిలిన ఆరుగురూ ఎవరన్న విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చివరాఖరికి కారు పార్టీలో కూడా చేయందుకునే ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  అయితే కాంగ్రెస్ నుంచి మాత్రం కారు దిగి చేయందుకోబోయే ఎమ్మెల్యేలెవర్న విషయంపై ఎటువంటి లీకులూ రావడం లేదు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఇటీవల ఫాం హౌస్ లో నిర్వహించిన అత్యవసర సమావేశానికి కేటీఆర్ కూడా డుమ్మా కొట్టడం రాజకీయంగా ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది.