నరసింహావతారం నరులకు ఇచ్చే సందేశం!

మహావిష్ణువు అవతారాలు ఎన్ని అంటే చాలా మంది పది అంటారు. కానీ మహావిష్ణువు పూర్తి అవతల 21. వీటిని ఏకవిశంతి అవాఘారాలు అంటారు. వీటిలో చాలా ప్రముఖమైనవి, కథలుగా ప్రాచుర్యంలో ఉన్నవి పది. ఆ పది అవతారాలు మహావిష్ణువు ఒక్కో యుగంలో ఒకో విధంగా ఆవిర్భవించి ఈ లోకాన్ని దుష్టుల నుండి కాపాడుతూ దుష్ట శిక్షణ, శిష్ఠ రక్షణ అనే విషయాన్ని వ్యాప్తం చేసాడు. అలా  విష్ణుమూర్తి దశావతారాలలో నాలుగవ అవతారం అయిన నరసింహ అవతారం ఎంతో విశిష్టమైనది. పూర్తి మనిషిగా కాకుండా, పూర్తి మృగంలా కాకుండా రెండింటి కలయికతో ఆవిర్భవించిన భీకర స్వరూపం ఈ నరసింహ అవతారం.

ఆవిర్భావం వెనుక కథ, వృత్తాంతం!!

జయవిజయులు వైకుంఠంలో విష్ణుమూర్తి ద్వారపాలకులు. అర్థమయ్యేలా చెప్పాలంటే లోపలికి ఎవరికీ పంపకుండా కాపలా ఉండటం. ఎవరైనా విష్ణుమూర్తిని కలవడానికి వస్తే మొదట విష్ణుమూర్తికి విషయం చెప్పి ఆయన సరేనంటే వాళ్ళను లోపలికి పంపడం. ఒకరోజు సనకసనందనాది మునులు విష్ణుమూర్తి దర్శనానికి వస్తే "ఇప్పుడు విష్ణుమూర్తిని కలవడానికి కుదరదు" అని చెప్పారు. ఆ మునులకు కోపం వచ్చి "మీరు విష్ణుమూర్తి  దగ్గర ఉంటున్నామని గర్వంతో ఇలా అంటున్నారు కదా, విష్ణులోకం నుండి మీరు దూరమైపోతారు" అని శాపం పెట్టారు. 

ఆ జయవిజయులు విష్ణుమూర్తిని అడిగితే "ఏడు జన్మలు నాకు మంచి భక్తుల్లా పుడతారా?? లేక మూడు జన్మలు నాకు శత్రువులుగా పుట్టి నాచేతిలోనే మరణిస్తారా??" అని అడిగాడు విష్ణువు. 

ఏడు జన్మలు మేము ఉండలేము, మూడు జన్మలు మీకు శత్రువులుగా పుట్టి మీ చేతిలోనే మరణిస్తాము" అని అన్నారు వాళ్ళు.

అలా కృతయుగంలో పుట్టిన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులే ఈ జయవిజయులు. చాలామంది తిట్టుకుంటూ ఇలా గుర్తుచేసుకోవడాన్ని వైరి భక్తి అంటూ ఉండటం వైన్ ఉంటాం.

హిరణ్యకశిపుడు బ్రహ్మ నుండి వరం పొందాడు. గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి గాని, పగలు గాని, దేవదానవమనుష్యుల చేతుల్లో కానీ, జంతువులతో కానీ, ఆయుధములచేత కానీ, ఇంట్లోకాని, బయటకాని మరణము కలగకుండా వరం సంపాదించాడు. అందువల్ల హిరణ్యకశిపుడిని ఎవరూ ఏమీ చేయలేకపోయారు.

ప్రహ్లాదుడు, నృసింహ ఆవిర్భావం!!

ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి కొడుకు. యుద్ధం జరిగి హిరణ్యకశిపుడి భార్యను ఇంద్రుడు ఎత్తుకుని పోతే నారదుడు ఇంద్రుడిని మందలించి ఆమెను తన ఆశ్రమానికి తీసుకెళ్లి రక్షణ కల్పిస్తాడు. ఆ సమయంలో నారదుడు చెప్పిన భాగవత విషయాలను విన్న ప్రహ్లాదుడు పుట్టుకతో విష్ణు భక్తుడిగా మారిపోయాడు. 

శివుడు, విష్ణువు శత్రువులు కాకపోయినా వీరి భక్తులు మాత్రం ఎప్పుడూ శత్రుత్వంతో రగిలిపోయేవారు. వాళ్లలో హిరణ్యకశిపుడు కూడా ఒకడు. విష్ణువంటే సరిపడదు అందుకే కొడుకును చంపాలని చూసి విఫలమై చివరకు ఎక్కడున్నాడు నీ హరి??" అని ప్రశ్నించగా. స్థంబాన్ని చీల్చుకుని వచ్చిన మనుష్య, మృగ అవతారమూర్తి నరసింహుడు.

బ్రహ్మ ఇచ్చిన వరంలో ఉన్న అంశాల ఆధారంగా వాటన్నిటినీ మినహా ఇస్తూ హిరణ్యకశిపుడిని ఇంటి గడప మీద చేతి గొర్లతో కడుపు చీల్చి వధించాడు. 

ఇదీ నరసింహావతార కథ.

అంతార్థం!!

ఆ భగవంతుడు ఈ సృష్టిలో అణువణువు నిండి ఉంటాడు. భగవద్గీత చెప్పే విషయం ఇదే. దాన్నే ప్రహ్లాదుడు తన భక్తితో చెప్పాడు.

వైర భక్తి. ప్రపంచంలో మనుషులు శత్రువులు అయినా వారిలో ఖచ్చితంగా ఎదజేటివాడు సరిచేసుకోగలిగిన అంశాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుచేస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఒక శత్రువు లోపాన్ని ఎత్తి చూపినట్టు, స్నేహితులు, దగ్గరివాళ్ళు చూపించరు. కాబట్టి శత్రువు ఎప్పటికైనా మంచివాడే.

మృగ స్వభావం ప్రతి మనిషిలో అంతర్లీనంగా ఉంటుంది. ఆ మృగస్వాభావం వచ్చినప్పుడు మనిషి విచక్షణ కోల్పోతాడు అనే విషయం ఈ నరసింహ అవతారంలో స్పష్టం అవుతుంది. విచక్షణ కోల్పోయిన మనిషి చేసే పనులలో చాలా నష్టాలు ఉంటాయని అంటారు. కాబట్టి మృగ స్వభావం అనేది మనిషిని ఎప్పుడూ దిగజార్చకూడదు.

ఇలా నరసింహ అవతారం మనిషికి ఎన్నో విషయాలు బోధిస్తుంది. నరసింహస్వామిని ఆరాధిస్తే అరిశడ్వర్గాలను అదుపులో ఉంచుకునే మానసిక శక్తి, ఇంకా అంతులేని ధైర్యం చేకూరుతాయి. అలాగే భయాలు తొలగిపోయి. 

ఒకటి మాత్రం నిజం. లక్ష్మినారాయణుడు అన్నా, లక్ష్మీ నరసింహస్వామి అన్నా ఒకటే, అవతారాలు వేరు.  అన్నింటిలో నిండినది ఆ పరమాత్మే.

                          ◆ వెంకటేష్ పువ్వాడ.

 ⁠