ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట..18 మంది మృతి
posted on Feb 16, 2025 5:40AM
.webp)
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. మహా కుంభమేళాకు వెళ్లే భక్తులతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని కిక్కిరిసిపోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మహా కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లు వేసినప్పటికీ అంచనాలకు మించి భక్తుల రద్దీ ఉండటంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఈ తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని 14వ నంబరు ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నిలిచి ఉండడంతో మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడికి భారీగా చేరుకున్నారు. అప్పటికే రావాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్.. భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం 12, 13, 14 నంబరు ప్లాట్‌ఫాంలపై వేచి ఉన్న ప్రయాణికులు.. ఒక్కసారిగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు చెబుతున్నారు. మృతులలో మహిళలు, చిన్నరులు కూడా ఉన్నారు. కాగా ఈ తొక్కిసలాటలో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా ముగిసే తేదీ దగ్గరపడుతుండటం, వారాంతం కావడంతో భక్తులు అనూహ్యంగా పోటెత్తారు. మహా కుంభమేళాకు వెళ్లే రెండు రైళ్లు ఆలస్యం అయ్యాయి. దీంతో 14, 15 ప్లాట్‌ఫామ్‌లపై తీవ్ర రద్దీ నెలకొంది. అదే సమయంలో ప్రయాగ్ రాజ్ ప్రత్యేక రైలు అనౌన్స్ మెంట్ రావడంతో భక్తులు ఒక్కసారిగా ప్లాట్ ఫామ్ మారేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జివైపు పరుగులు తీశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌కు దారితీసే రోడ్డు మార్గాలపై విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో జనం రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నెల 29తో మహా కుంభమేళా ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే రైళ్లల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గత నెల 29న కూడా ప్రయాగ్ రాజ్ లో తొక్కిసలాట జరిగి 30 మంది మరణించిన సంగతి తెలిసిందే.