ప్రేమించే మనసు.. ప్రేమకై పరితపించే మనసు.. !
posted on Feb 14, 2025 9:30AM

ప్రేమ రెండక్షరాల పదం. కానీ ఇందులో ఉన్న ఎమోషన్ జీవితానికి సరిపడినంత. మరు జన్మలో కూడా దానిని వెంటబెట్టుకుని ప్రేమకై పరితపించేంత. అసలు ఏముంది ప్రేమలో అంటే.. జీవితం ఉంది.. ప్రాణముంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రేమలో అంతుచిక్కని భావోద్వేగం ఉంటుంది. ఇప్పటి కుర్రకారు ఎవరైనా నచ్చగానే ఐ లవ్ యూ అని చెప్పడం కాదు ప్రేమంటే.. అసలు ప్రేమకు ఈ జనరేషన్ వారికి సరైన అర్థం తెలియదు. ఎవరికి తోచింది వారు.. ఎవరికి నచ్చింది వారు అన్వయించుకుంటారు. కానీ అసలైన ప్రేమకు అసలు జెండర్ అనే అవరోధం లేదు.
ప్రేమంటే..
ప్రేమంటే ఒక మనిషిని ఇష్టపడటం, ఒక మనిషి మనకు నచ్చింది కాబట్టి మనలా వారు కూడా మారాలని అనుకోవడం, మనకోసం వారి జీవితాన్ని మార్చేసుకోవడం, వారికంటూ ఇక వేరే ప్రపంచం ఏమీ లేకుండా వారికి తామే ఎక్కువ అవ్వాలని అనుకోవడం. ఇదీ ఇప్పట్లో చాలామంది ఆలోచన. బయటకు స్పష్టంగా చెప్పరు. నిజానికి వారికే స్పష్టంగా అవగాహన లేదు కానీ.. ప్రేమ అంటే తాము కావాలని అనుకున్న ఒక వస్తువు తనకు దక్కించుకోవడం లాంటిది అనేది చాలా మంది అభిప్రాయం. కానీ ప్రేమ అంటే ఒక ఆరాధానా భావం. ప్రేమిస్తే వ్యక్తిని ప్రేమించాలి, వ్యక్తి అలవాట్లను గౌరవించాలి. వ్యక్తిలో లోపాలను అర్థం చేసుకోవాలి. ఒకవేళ వ్యక్తిలో చెడ్డ గుణం ఉంటే ఆ వ్యక్తిని ప్రేమతో భరించాలి.
తీసుకోవడం.. వదిలేయడం.. ఇంతేనా..
ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక వ్యక్తిని ప్రేమిస్తే వెంటనే ప్రపోజ్ చేసేస్తారు. ఆ తరువాత తమకు నచ్చినట్టు వాళ్లు ఉండాలని కోరుకుంటారు. వారి అటెన్షన్ మొత్తం తమ మీద ఉండాలని కోరుకుంటారు. ఆ తరువాత వేరే ఎవరి గురించి వారు మాట్లాడినా అస్సలు నచ్చదు వారికి. లేదు.. వారు తమకు నచ్చినట్టు, తమ అభిరుచులకు తగ్గట్టు ఉంటామంటే.. సింపుల్ గా బ్రేకప్ చెప్పేస్తారు. ఇదీ నేటి సమాజం పోకడ. ఇలాంటివి చాలా జరగడం వల్లనే ప్రేమంటే.. ఓస్.. ఇంతేనా అనిపిస్తుంది.
జెండర్ సంగతి..
ప్రేమంటే ఒక ఆడ, ఒక మగ మధ్య ఉండేదని అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే ప్రేమంటే ఇది కాదు.. ఒక ఆడ, మగ మధ్య ఉండేది ఆకర్షణతో కూడిన ప్రేమ. కానీ భౌతిక ఆకర్షణ లేకుండా కేవలం మనసును చూసి, మనిషి గుణాన్ని చూసి ప్రేమించడం,ఎలాంటి స్వార్థం లేకపోవడం అనేది ఉంటుంది. అదే ప్రేమ అనే కోవలోకి వస్తుంది. ప్రేమను వ్యక్తం చేయడం ప్రేమ కలిగి ఉండటం అంటే కేవలం కేవలం మనసుకు మాత్రమే సంబంధించినది. ఇక్కడ అమ్మ నాన్న ప్రేమ, తోబుట్టువుల ప్రేమ, అవ్వతాతల ప్రేమ, గురువుకు శిష్యునికి మధ్య ప్రేమ, దేవుడికి భక్తుడికి మధ్య ఉన్న ప్రేమ.. ఇట్లా ఒక్కటనే కాదు.. మనిషితో సంబంధం లేకుండా కేవలం మనసుతో అనుబంధం ఏర్పడేదే ప్రేమ. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవ్వరైనా కనీసం పరిచయంతో సంబంధం లేకుండా ఆప్యాయంగా మాట్లాడితే.. బాధను పంచుకుంటే.. అపన్న హస్తం అందిస్తే.. వారు ప్రేమను నింపుకున్న మనుషులు.. వారు చూపించేదే ప్రేమ.. అంతేకానీ తమ స్వార్థం కోసం తమకు నచ్చి దాన్ని సాధించుకోవడానికి ప్రేమ అనే పేరును వాడితే అది ప్రేమ కాదు.. వారిది ప్రేమ మనసు కాదు. అందుకే ప్రేమంటే ఇవ్వడమే.. తిరిగి ఆశించడం కాదు..
*రూపశ్రీ.