అంతరిక్షాన్ని అన్వేషించిన అతని చూపు....
posted on Feb 15, 2025 9:30AM

శాస్త్ర పరిశోధన పెద్ద పాపంలా భావించే కాలంలో ఆయన శాస్త్రీయ విప్లవంలో భాగమయ్యారు. ఎన్ని విమర్శలు, వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ తన పరిశోధన ఆపకుండా వివిధ రంగాల్లో ఆయన చేసిన శాస్త్రీయ పరిశీలనలు, ప్రయోగాత్మక విధానాల వల్ల, ఆయనను ఆధునిక ఖగోళ శాస్త్రపు పితామహుడు, ఆధునిక భౌతికశాస్త్ర, విజ్ఞానశాస్త్ర పితామహుడిగా పిలుస్తారు. ఆయన శాస్త్రీయ పరిశోధనలు ప్రకృతి, విశ్వం యొక్క రహస్యాలను వెలికితీయడంలో మూలస్తంభంగా మారాయి. ఖగోళ శాస్త్రం ఈనాడు ఇంతలా అభివృద్ధి చెందటానికి మూలమైన గెలీలియో గురించి తెలుసుకుంటే......
గెలీలియో గురించి....
గెలీలియో 1564 ఫిబ్రవరి 15న, ఇటలీలోని పిసా నగరంలో జన్మించారు. ఆయన పిసా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అక్కడ మెడిసిన్ చదివి డాక్టర్ కావాలనుకున్నారు. కానీ కోర్సుని పూర్తి చేయలేదు. 1589లో ఆయన చదువును మానేశారు. ఐనాసరే గణితశాస్త్రం పట్ల ఆసక్తితో ఆ విశ్వవిద్యాలయంలోనే గణితాన్ని బోధించారు. ఆయన చలనం, గురుత్వాకర్షణ వంటి భౌతిక ఘటనలను అధ్యయనం చేయడం ప్రారంభించారు. అనేక గ్రంధాలు , ఉపన్యాసాలు, సిద్ధాంత గ్రంథాలపై పని చేశారు. అరిస్టోటిల్ ఆలోచనలని విమర్శించారు. తన ప్రయోగాలు, పరిశీలన ద్వారా ప్రకృతిని అర్ధం చేసుకోవటంలో కొత్త విధానాలు కనుగొన్నాడు. కోపర్నికస్ యొక్క హీలియోసెంట్రిక్ థియరీని సమర్థించినందుకు చర్చి విచారణ ఆయనను గృహ నిర్బంధానికి గురి చేసింది. ఈ సమయంలో, ఆయన అప్ప్లైడ్ ఫిజిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటీరీయల్ ఇంజినీరింగ్ వంటి రంగాల్లో తన పరిశోధనను కొనసాగించారు.
సైన్సు కోసం చేసిన కృషి......
గెలీలియో శాస్త్రీయ పరిశోధనలు కేవలం ఒక్క రంగానికే పరిమితం కాలేదు. చంద్రుని లక్షణాలు, శుక్రగ్రహ దశలు , గురుగ్రహపు నాలుగు ఉపగ్రహాలు, సూర్యుని మీదున్న మచ్చలు వంటి అనేక ఖగోళ పరిశీలనల్లో విశేషానుభవం సంపాదించాడు. ఆయన ఒక గొప్ప మేధావి. టెలిస్కోప్‌ను శాస్త్రీయ ప్రయోజనాలకు మాత్రమే గాక సైనిక ప్రయోజనాల గురించి కూడా ఉపయోగపడేలా మెరుగుపరిచారు. గణిత గణనల కోసం కూడా ఉపయోగించారు. ఆయన డిజైన్ చేసిన టెలిస్కోప్ అప్పట్లో సైనికులు ఉపయోగించే బాలిస్టిక్, సైనిక కంపాస్ల ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడింది. ఆయన 1632లో "డైలాగ్ కన్సెర్నింగ్ ది టూ చీఫ్ వరల్డ్ సిస్టమ్స్” అనే ప్రసిద్ధ గ్రంథాన్ని ప్రచురించారు. ఈ గ్రంథంలో శాస్త్రీయ ప్రబోధం, గెలీలియో ఖగోళ పరిశీలనలు, సిద్ధాంతాలు, విశ్వం గురించిన టాలమీ సిద్ధాంతంపై అరిస్టోటిల్ దృక్పథం ఏమిటనే చర్చ కూడా ఉంటుంది.
ఎదుర్కొన్న విమర్శలు.....
అప్పట్లో సైన్సు అంతగా అభివృద్ధి చెందలేదు. మూఢనమ్మకాలే తప్ప శాస్త్రీయ దృక్పధం లేని కాలం కావటంతో గెలీలియో తన ప్రయోగాలు, పరిశీలనల వల్ల ప్రధాన వివాదాల్లో చిక్కుకుని విమర్శలకు గురయ్యారు. మతగ్రంధం పట్ల అతివిశ్వాసం ఉన్నవాళ్ళు, ఆయన పరిశోధనలు, అభిప్రాయాలు చర్చి బోధనలకు విరుద్ధంగా ఉన్నాయని భావించారు. గెలీలియో తన టెలీస్కోప్ ద్వారా పరిశీలించిన మొదటి శాస్త్రీయ వివరణ అయిన "స్టారీ మెసెంజర్”ను పబ్లిష్ చేసిన ఐదు సంవత్సరాల తర్వాత, చర్చి ఆయనపై కఠిన చర్యలు తీసుకుంది. 1615లో రోమన్ విచారణ ముందు హాజరుకావాల్సిందిగా పిలిచారు. హీలియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని ప్రచారం చేయకూడదని హెచ్చరించారు. కానీ 1633లో కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసినందుకు ఆయనను దోషిగా ప్రకటించి, జీవితాంతం గృహ నిర్బంధ శిక్ష విధించారు. అలా 1642 జనవరి 8న గృహ నిర్బంధంలోనే మరణించారు.
గెలీలియో చేసిన విస్తృతమైన పరిశోధనలు ఆధునిక విజ్ఞానశాస్త్రం అభివృద్ధికి మార్గదర్శనమయ్యాయి. ఆయన సిద్ధాంతాలు, ప్రయోగాలు సైన్సు అభివృద్ధిలో ఎంతో కీలకంగా మారాయని చెప్పటం అతిశయోక్తి కాదు. ఆయన చేసిన శాస్త్రీయ విశ్లేషణలు, పరిశోధనలు విజ్ఞానశాస్త్రంలో స్థిరంగా నిలిచిపోయాయి. ఆయన ప్రభావం ఆధునిక శాస్త్ర ప్రపంచాన్ని రూపొందించడంలో కీలకంగా మారింది.
*రూపశ్రీ