పోరాటంలో భయమెరుగని మహిళా నేత, సాహిత్యంలో ‘భారత కోకిల’.. సరోజినీ నాయుడు జయంతి..!
posted on Feb 13, 2025 9:30AM

ఆమె స్వాతంత్ర్య పోరాటంలో భయపడకుండా ధైర్యంగా నిలబడ్డ సివంగి. ఒక అసాధారణమైన కవయిత్రి, గొప్ప రాజకీయ నేత. మన దేశ స్వాతంత్ర్యం కోసం, సాహిత్యం, మహిళల హక్కుల కోసం ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా మన ప్రభుత్వం ప్రతీ ఏటా ఆమె జయంతిని ‘జాతీయ మహిళా దినోత్సవం’గా జరుపుకుంటుందంటేనే అర్ధం చేసుకోవచ్చు…. దేశ స్వాతంత్ర్య పోరాటంలో, మహిళల హక్కుల సాధనలో ఆమె ఎంతలా ప్రభావం చూపించిందో.. అంత ధైర్యం, దేశభక్తి కలిగిన ఆమె ఎవరో కాదు, ‘భారత కోకిల’ గా ప్రసిద్ధి పొందిన సరోజినీ నాయుడు.. భారత చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న సరోజినీ నాయుడు గురించి చాలామందికి తెలియని విషయాలు తెలుసుకుంటే..
సరోజినీ నాయుడు 1879, ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో జన్మించింది. తండ్రి అఘోర్నాథ్ చటోపాధ్యాయ ఒక శాస్త్రవేత్త, తత్వవేత్త. తల్లి బరద సుందరి దేవి కవయిత్రి. తల్లిదండ్రుల ప్రభావం వల్లనేమో ఆమె చిన్నప్పటి నుంచే రచనలు చేసేది. లండన్‌లోని కింగ్స్ కాలేజ్, కేంబ్రిడ్జ్ లోని గిర్టన్ కాలేజ్‌లో విద్యనభ్యసించింది. విదేశాల్లో చదువుకుంటున్న సమయంలోనే గోపాలకృష్ణ గోఖలే, మహాత్మాగాంధీ వంటి నాయకుల ప్రభావం ఆమెపై పడింది. ఇదే ఆమెను స్వాతంత్ర్య పోరాటంలో భాగమవ్వటానికి స్పూర్తినిచ్చింది.
స్వాతంత్య్రానికి మునుపు, తర్వాత రాజకీయ కృషి...
సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్(ఐఎన్‌సి)లో చురుకుగా పాల్గొని స్వతంత్ర సాధన కోసం కృషి చేసింది. ఐఎన్‌సి కి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. మహాత్మా గాంధీ నడిపిన ఉప్పు సత్యాగ్రహం(1920), క్విట్ ఇండియా ఉద్యమం(1942) వంటివాటిలో పాల్గొని 21నెలల జైలుశిక్ష కూడా అనుభవించింది. భారత స్వాతంత్య్రానంతరం దేశంలోనే తొలి మహిళా గవర్నర్‌గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సేవలందించింది. ఆమె గవర్నరుగా ఉన్నప్పుడు మతసామరస్యాన్ని నెలకొల్పేందుకు ఎంతో కృషి చేసింది. మహిళల ఉపాధి, చట్టపరమైన హక్కులను సమర్ధవంతంగా ప్రోత్సహించింది. విద్య, సామాజిక సంక్షేమ కార్యక్రమాలని ప్రోత్సహించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె నాయకత్వం స్వతంత్ర భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది.
సాహిత్యంలో కృషి.....
సరోజినీ నాయుడి కవిత్వం.. సాహిత్యంలో సౌందర్యం, దేశభక్తి భావాలను నింపుకుని ఉంటుంది. భారతీయ ఇతివృత్తాలను, పాశ్చాత్య సాహిత్య శైలితో కలగలిపి రచనలు చేయడంతో భారతదేశపు గొప్ప కవయిత్రులలో ఒకరిగా నిలిచింది. "ది గిఫ్ట్ ఆఫ్ ఇండియా" అనే కవితతో మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికుల సేవలకు నివాళులర్పించింది. ‘ది గోల్డెన్ థ్రెషోల్డ్’, ‘ది బర్డ్స్ ఆఫ్ టైమ్’, ‘ది బ్రోకెన్ వింగ్’, ‘ది సెప్టర్డ్ ఫ్లూట్’ వంటి ఎన్నో రచనలు చేసింది. ఆమె మరణానతరం ప్రచురించబడిన “ది ఫెదర్ ఆఫ్ ది డాన్” ఆమె అద్భుతమైన కవితా ప్రతిభను సూచిస్తుంది. ఆమె సాహిత్య ప్రతిభకుగానూ “భారత కోకిల” అనే బిరుదు లభించింది.
మహిళా హక్కుల పరిరక్షణలో..
సరోజినీ నాయుడు మహిళా హక్కుల కోసం తన జీవితాంతం పనిచేసింది. దేశ పురోగతికి మహిళా సాధికారత అవసరమని బలంగా నమ్మింది. ‘ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్’ సహవ్యవస్థాపకురాలిగా ఉంటూ మహిళల విద్య, ఆరోగ్యం, చట్ట పరిరక్షణ కోసం పని చేసింది. ‘ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్’ అధ్యక్షురాలిగా మహిళల ఓటు హక్కు, చట్ట పరిరక్షణ కోసం ఉద్యమించింది. జాతీయంగానే గాక గ్లోబల్ సమావేశాల్లో కూడా మహిళల ఓటు హక్కు కోసం భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.
వారసత్వానికి గౌరవమివ్వాలి.....
సరోజినీ నాయుడు కృషికి గుర్తింపుగా మన ప్రభుత్వం ‘జాతీయ మహిళా దినోత్సవం’ జరుపుకుని నివాళులర్పిస్తుంది. అలాగే మహిళా సమస్యలపై పోరాడిన ఉత్తమ జర్నలిస్టులకి “సరోజినీ నాయుడు అవార్డు” ఇచ్చి, ఆనాడు ఆమె మహిళల కోసం చేసిన కృషిని గుర్తు చేస్తుంది. ఆమె పేరుతో అనేక విద్యా సంస్థలు కూడా నెలకొల్పబడ్డాయి. ఆమె వారసత్వం తరతరాల వారికి ప్రేరణగా నిలుస్తోంది. మనం ఆమెకు నివాళులర్పిస్తూనే సమానత్వం, సాధికారత, దేశభక్తి అనే విలువలను ముందుకు తీసుకెళదాం..
*రూపశ్రీ.