ప్లాస్టిక్ కి 'లక్ష్మీ కళ' రాబోతోంది!
posted on Dec 10, 2016 3:10PM

గత నెల రోజులుగా అందరి ముఖాలు వెలవెలబోవటానికి కారణం ఏంటి? కరెన్సీ కటకటే! పదులు, ఇరవైలు, యాభైలు, వందలు లేక వేల కష్టాలుపడుతున్నారు జనం! అటు ప్రభుత్వం కూడా తనకు చేతనైనంత చేస్తూనే వుంది. అయితే, 2వేల నోటుగాని, వచ్చి వెళ్లిపోయిన 500 నోటుగాని జనం ఆరాటాన్ని తీర్చలేకపోతున్నాయి. బ్యాంకులు, ఏటీఎంలు కిటకిటలాడిపోతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి?
ఇప్పటికిప్పుడు భారతీయుల నోట్ల కష్టాలు తీరకపోవచ్చు. కొన్ని నెలల్లో అంతా సద్దకుంటుందని చాలా మంది ఆశిస్తున్నారు. అయితే, ఇప్పడు చాలా మంది చిన్న నోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. పది, ఇరవై, యాభై, వంద ... ఎంత త్వరగా వస్తే అంత హ్యాపీగా వుంటుందంటున్నారు. అందుకే, మోదీ సర్కార్ ఒక వినూత్న ఆలోచనను కార్యరూపంలో పెడుతోంది! అదే ప్లాస్టిక్ మనీ!
ప్లాస్టిక్ మనీ అంటే పేపర్ కి బదులు ప్లాస్టిక్ ని గాని, పాలిమర్స్ ని గాని వాడుతూ తయారు చేసే కరెన్సీ. ఈ ఐడియా మరీ కొత్తదేం కాదు. ఆస్ట్రేలియాలోనైతే ఆల్రెడీ మొత్తమంతా ప్లాస్టిక్ నోట్లే! ఇంకా అనేక దేశాల్లో ప్లాస్టిక్ డబ్బులు చకచకా వాడేస్తున్నారు. ఆస్ట్రేలియాలో 1970లలో మొదలు పెట్టి మెల్లగా అన్ని నోట్లూ ప్లాస్టిక్ లోకి మార్చేశారు. ఇప్పుడు మన దేశంలోనూ అదే చేయబోతున్నారట. పెద్ద నోట్ల కంటే ముందుగా చిన్న డినామినేషన్స్ ని ప్లాస్టిక్ లో అచ్చేయబోతున్నారు. అయితే, ఈ ప్లాస్టిక్ నోట్లు పేపర్ నోట్స్ అంత పకడ్బందీగానే వుంటాయి. ప్లాస్టిక్ నోటులో కూడా సెక్యురిటీ త్రెడ్ లాంటి అన్ని ఫీచర్స్ వుంటాయి. ఇంకా కొన్ని ఎక్స్ ట్రా ఫీచర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అందుకే, చాలా దేశాలు ప్లాస్టిక్ జిందాబాద్ అంటున్నాయి!
ఇండియాలో మరి కొన్ని నెలల్లో రాబోతోన్న తళతళలాడే ప్లాస్టిక్ నోట్లు ముందుగా కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్ నగరాల్లో అందుబాటులోకి వస్తాయట. హైద్రాబాద్, ముంబై లాంటి మహానగరాలకి ట్రయల్స్ అన్నీ అయ్యాక వస్తాయి. అంటే కొంచెం లేట్ అయ్యేలానే వున్నా ప్లాస్టిక్ మీన ఎంట్రీతో మార్కెట్ తీరే మారిపోనుంది! ఒక్కసారి అచ్చేస్తే , ప్లాస్టిక్ మనీ కనీసం 5ఏళ్లు చెక్కుచెదరకుండా వుంటుందట! అందువల్ల పేపర్ కరెన్సీ కంటే దీన్ని తయారు చేయటం చౌక అంటున్నారు ఎక్స్ పర్ట్స్...
ప్లాస్టిక్ నోట్లతో ఇప్పటికే ఆస్ట్రేలియా దొంగ నోట్ల బెడద నుంచి బయటపడింది. పాక్ లాంటి శత్రువుతో పోరాడుతోన్న మనం ఈ పరిష్కారం సాధ్యమైనంత త్వరగా వాడుకోవాలి.