ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు!?

 

పంచాయతీ ఎన్నికల విజయంతో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. ఇదే జోష్ లో మునిసిపల్ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది.  విద్యార్థుల పరీక్షల సీజన్ ప్రారంభం కాకముందే.. అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారం నాటికే మునిసిపల్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ కృత నిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది.  వచ్చే ఏడాది  మార్చిలో విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకే ఆ పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది.  ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి  మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని  ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

అదలా ఉంటే రాష్ట్రంలోని  120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు 2025 జనవరితోనే గడువు ముగిసింది. అప్పటి నుంచీ ఇవన్నీ ప్రత్యేక అధికారల పాలనలో కొనసాగుతున్నాయి.  ఇక పోతే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్,  ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది. దీంతో వీటికి కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే.. పాలకవర్గాల గడువు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉన్న మహబూబ్‌నగర్, నల్గొండ  మున్సిపాలిటీల కు మాత్రం ఇప్పుడు అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. 

ఇలా ఉండగా   హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌  పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసివదే. అలాగే కొన్ని  నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా, మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ సహా మొత్తం 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.   వచ్చే ఏడాది జనవరి రెండో వారానికల్లా  ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.ఇందుకు సబంధించిన కసరత్తు కూడా ప్రారంభమైంది. అలాగే ప్రభుత్వం ఎప్పుడు పచ్చ జెండా ఊపితే అప్పుడు మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్రఎన్నికల కమిషన్  సిద్ధంగా ఉంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu