అమరావతికి చట్టబద్ధత కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిందే ?
posted on Dec 23, 2025 10:02AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. ఈ విషయంలో ఇప్పుడు ఎవరిలోనూ ఎటువంటి సందేహం లేదు. ప్రపంచ స్థాయి నగరంలో అమరావతి రూపుదిద్దుకుంటోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విజనరీ చంద్రబాబు మార్గదర్శకత్వంతో అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆల్ ఇన్ వన్ సిటీగా అమరావతి రూపుదాల్చుతోంది. ఇంత వరకూ అంతా బానే ఉంది. కానీ చాలా మందిలో ఓ చిన్న అనుమానం, చిన్న శంక, చిన్న సందేహం. ఒక వేళ తరువాత ఎప్పుడైనా జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి పరిస్థితి ఏమిటి?
2014 నుంచి 2019 వరకూ శరవేగంగా సాగిన అమరావతి నిర్మాణం.. 2019లో జగన్ అధికారంలోకి రాగానే పడకేసింది. అంత వరకూ నిర్మాణ పనులతో కళకళలాడిన అమరావతి, జగన్ మూడు రాజధానులంటూ ప్రారంభించిన మూడు ముక్కలాటతో నిర్మాణుష్యమైపోయింది. పురోగతిలో ఉన్న భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. అప్పటి వరకూ కళకళలాడిన అమరావతి వెలవెలబోయింది. మరో సారి అటువంటి పరిస్థతి రాకూడదంటే అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్నది జనం డిమాండ్ గా మారిపోయింది. అందుకు రాష్ట్రప్రభుత్వమూ సై అంది. అందుకే ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఆమోదముద్ర వేయాల్సిన పరిస్థితి వచ్చింది.
2019లో జగన్ అధికారం చేపట్టిన తరువాత అమరావతిని నిర్వీర్యం చేయడంతో ఆంధ్రప్రదేశ్ గత పదకొండేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది.
అందుకే ఇప్పుడు రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రాజధాని కోసం లాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చిన రైతులు ఈ విషయంలో గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఆమోదముద్రపడుతుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ శీతాకాల సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసారు. అయినా ఈ సమావేశాల్లో అటువంటి అవకాశం లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. స్వయంగా ప్రధాని మోదీ చేతులమీదగా రెండుసార్లు అమరావతి శంకుస్థాపన జరిగింది. .33వేల ఎకరాల భూములిచ్చిన రైతులకు అభివృద్ధిచేసిన ప్లాట్స్ ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీని 10 ఏళ్లు గడిచినా అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు మళ్లీ 20 వేల ఎకరాలు రాజధాని విష్తరణకు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం పూలింగ్ ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో చంద్రబాబు కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు.