చట్టంతో గేమ్స్.. జగన్ కు అబ్బిన అనువంశిక విద్య!
posted on Dec 27, 2025 8:59AM

చట్టం, న్యాయం, కోర్టులు ఇలాంటి వాటిని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఖాతరు చేయరు. వాటితో చెలగాటమాడటం ఆయనకు రాజకీయ ప్రవేశానికి ముందు నుంచీ బాగా అలవాటైన విద్య. ఇదీ జగన్ గురించి న్యాయనిపుణులు చెప్పే మాట.
అందుకు వారు ఉదహరిస్తున్న ఈ క్రోనాలజీ చూస్తే ఎవరికైనా అది నిజమేగా అనిపించకమానదు. జగన్ కి కోర్టులు, చట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసినవారెవరూ ఉండకపోవచ్చచునం టారు పరిశీలకులు. ఈ విషయంలో జగన్ తాత రాజారెడ్డి కాలం నుంచి వైఎస్ కుటుంబానికి అనువంశికంగా అబ్బిన విద్య అంటారు.
లా యునివర్శిటీ ఎలాగో.. అన్ లాయూనివర్శిటీ అనేది ఉండి ఉంటే ఆ వర్సిటీకి జగన్ ను హెడ్ అయి ఉండేవారంటారు. ఇప్పటి వరకూ జగన్ క్విడ్ ప్రోకో కేసుల్లో చట్టంతో చెలగాటమాడుతున్న తీరు తెలిసిందే. విచారణ ముందుకు సాగకుండా వరుస డిశ్చార్జ్ పిటిషన్ లతో ఆయన కేసును సాగతీస్తున్న తీరు న్యాయ నిపుణులనే విస్మయపరుస్తోంది.
ఇటీవల జగన్ కేసులను పరిశీలిస్తున్న న్యాయమూర్తి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మరో న్యాయమూర్తి వచ్చారు. జగన్ కేసులు విచారిస్తున్న న్యాయమూర్తి బదలీ అయితే ఏంటి అని అంతా అనుకోవచ్చు కానీ కొత్తగా వచ్చిన న్యయమూర్తి జగన్ కేసులకు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ పరిశీలించడానికి కొన్నేళ్లు పడుతుంది. దీంతో కథ మళ్లీ మొదటికే వస్తుంది. సరే బదలీ అనేది సాధారణం కదా అనుకోవచ్చు. కానీ జగన్ తన కేసుల విచారణ ముగింపు లేకుండా అలా కొక.. సాగుతూ ఉండటానికి పలు పద్ధతులు అవలంబిస్తుంటారు.. వాటిలో ఒకటే డిశ్చార్జీ పిటిషన్ల వరద పారించడం. ఇప్పటి వరకూ జగన్ కేసులలో 130 డిశ్చార్జీ పిటిషన్లు దాఖలయ్యాయి. అలాగే విచారణపై స్టేలు కోరుతూ పిటిషన్ వేయడం. ఇలాంటి పిటిషన్ల విచారణ ద్వారా కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకోవడం, అలాగే ఈ కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడం. 2019- 24 మధ్య సీఎంగా అధికారంలో ఉన్నందున, పాలనా పరమైన అడ్డంకులకు అవకాశం లేకుండా, తనకు కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచిమినహాయింపు కావాలంటూ పిటిషన్ వేసి మినహాయింపు పొందిన జగన్.. ఇప్పుడు అధికారంలో లేకపోయినా, కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అయినా.. తాను కోర్టుకు వస్తే.. జనం ఇబ్బందిపడేంతగా ట్రాఫిక్ జామ్ లు ఏర్పడతాయనీ, తన భద్రతకు ప్రభుత్వానికి భారీగా ఖర్చు అవుతుందంటూ కోర్టును మళ్లీ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. తాను చెప్పిన మాట వాస్తవమని అందరూ నమ్మే విధంగా ఇటీవల ఆయన నాంపల్లి కోర్టుకు హాజరైనప్పుడు వైసీపీయులు చేసిన హంగామా జగన్ ప్లాన్ లో భాగమేనంటారు పరిశీలకులు.
ఒక సాధారణ ఎంఎల్ఏగా ఉన్న జగన్ కు ఎలాంటి హైఎండ్ ప్రోటోకాల్ లేకున్నా ఉన్నట్టు గా సృష్టించి.. కోర్టు విచారణకు తనకంటూ ఓ షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్న ఘనత జగన్ కే చెల్లుతుందంటున్నారు. తాను ఎప్పుడు కోర్టుకు హారైనా జనం ఇలా తండోపతండాలుగా తనను చూడటానికి వస్తారనీ, వారిని కంట్రోల్ చేయడం, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాలకు, పోలీసులకు తలకు మించి భారం అవుతుందన్న బిల్డప్ క్రియేట్ చేశారు. ఇప్పడు అదే చూపి మరో సారి కేసుల విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపు పొందినా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు. ఇన్ని రకాలుగా తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల దర్యాప్తు ముందుకు సాగకుండా జాప్యం అయ్యేలా జగన్ మేనేజ్ చేయగలుగుతున్నారంటే దానికి చట్టంతో చెలగాటమని కాకుండా మరేమనాలని ప్రశ్నిస్తున్నారు. కేసు వాయిదాలు కోరడానికే జగన్ న్యాయవాదుల ఖర్చు కోట్ల రూపాయలు ఉంటుందని ఇటీవల కొన్ని గణాంకాలువెలుగులోకి వచ్చాయి. లాతో గేమ్స్ ఆడుకోవడం ఎలా అని ఒలింపిక్స్ లో పోటీ పెడితే.. జగన్ కు గోల్డ్ మెడల్ ఖాయమంటూ నెటిజనులు సెటైర్లు పేలుస్తున్నారు. చూడాలి మరి ఇంకెంత కాలం ఈ కేసుల విచారణను జగన్ తన స్టైల్ లో సాగదీస్తారో?