తన హత్యకు కుట్ర.. దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు

వైసీపీ మాజీ నేత దువ్వాడ శ్రీనివాస్ మరో సారి తన మార్క్ రాజకీయ సంచలనం సృష్టించారు.  తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, తనను హత్య చేయడానికి కుట్రపన్నారంటూ శుక్రవారం (డిసెంబర్ 27) అర్ధరాత్రి  నిమ్మాడ హైవేపై ఆయన  హల్‌చల్ చేశారు.  ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికి దువ్వాడ మాధురి ఓ ఆడియో క్లిప్పింగ్ విడుదల చేశారు.  తన ఆరోపణలకు ఆధారాలు అన్నట్లుగా   దువ్వాడ వీడియో విడుదలైన కొద్దిసేపటికే.. దివ్వెల మాధురి ఒక ఆడియో క్లిప్పింగ్‌ను బయటపెట్టారు. 

 ఆ ఆడియో క్లిప్పింగ్ లోని  దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు   కింజారపు అప్పన్న, దివ్వెల మాధురిల సంభాషణ మేరకు.. రామస్వామి అనే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్‌పై దాడికి ప్రణాళిక రూపొందించాడని కింజారపు అప్పన్న దివ్వెల మాధురితో చెబుతున్నారు.   దువ్వాడ శ్రీనివాస్ విడుదల చేసిన వీడియో, దివ్వెల మాధురి బయటపెట్టిన ఆడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి.  సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని దువ్వాడ చేస్తున్న ఆరోపణలు వైసీపీలో అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతమయ్యాయి. ఇంతకీ తనను హత్య చేసేందుకు కుట్రపన్నుతున్నది వైసీపీ సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ అని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు.

తాను చావుకు భయపడనన్న దువ్వాడ.. తనపై దాడి చేయడానికి ఎవరోస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. శ్రీకాకుళంలో తాను స్వతంత్రంగానే రాజకీయాలు చేస్తానన్న దువ్వాడ    తనను వైసీపీ నుంచి పూర్తిగా బయటకు పంపిస్తే శ్రీకాకుళం జిల్లాలో ఇండిపెండెంట్ గా నిలబడి తన సత్తా ఏంటో నిరూపిస్తానని సవాల్ విసిరారు. పార్టీలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తనపై హత్యకు కుట్రపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu