ఆ గుజరాతీ వల్లే... మోదీ నోట్లు రద్దు చేశాడట!
posted on Dec 10, 2016 12:23PM
.jpg)
హస్ముఖ్ అధియా... ఈ పేరు ఇలా సింపుల్ గా చెబితే మీరు గుర్తుపట్టకపోవచ్చు. కాని, మరో రూట్ లో ఈయన గురించి చెబితే ఠక్కున గుర్తిస్తారు! అదే డీమానిటైజేషన్! అవును... మోదీ నోట్ల రద్దు వెనుక అసలు వ్యక్తి హస్ముఖ్ అధియానే. ఇంతకీ మోదీ చేత 500, 1000 నోట్లు రద్దు చేయించిన ఈ ఘనుడు ఎవరు? ప్రధాని అతని మాటని ఎందుకని ధైర్యంగా నమ్మారు?
హస్ముఖ్ అధియా ఒక గుజరాతీ బ్యూరోక్రాట్. నమోకి ఇప్పుడు కాదు... ఆయన సీఎంగా వున్నప్పటి నుంచే నమ్మిన బంటూ. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అధియా ముఖ్యకార్యదర్శిగా పని చేశాడు. అదుగో, అప్పట్నుంచే ఆయనంటే నరేంద్రుడికి గురి కుదిరింది. ఆయన నిజాయితీ, సమర్థత ఆకట్టుకున్నాయి. వెంటనే, తాను ప్రధాని అయ్యాక హస్ముఖ్ ను ఢిల్లీకి రప్పించారు. జైట్లీ సారథ్యంలోని ఆర్దిక శాఖలోని కీలక పోస్ట్ లో కూర్చోబెట్టారు. కాని, అధియా జైట్లీనే కాదు నేరుగా పీఎంనే కలిసే వీలుంది. అలా జరిగిన డైరెక్ట్ మీటింగ్ లలోనే మోదీ నోట్ల రద్దు గురించి అధియాని అడిగి తెలుసుకున్నారట. అంతే కాదు, చాలా సీక్రెట్ గా ఆయన నాయకత్వంలో ఒక టీమ్ ను ఏర్పాటు చేసి తన నివాసంలో రెండు గదులు కేటాయించి గ్రౌండ్ వర్క్ చేయమన్నారట. నెలల తరబడీ హస్ముఖ్ అండ్ టీమ్ నోట్ల రద్దు అంశంపై పని చేస్తున్నా ఎవ్వరికీ తెలియలేదంటే ఎంత పకడ్బందీగా వ్యూహం పన్నారో అర్థం చేసుకోవచ్చు!
నోట్ల రద్దు, దాని తరువాత వచ్చే పరిణామాలపై హస్ముఖ్ మొత్తం పూస గుచ్చినట్లు చెప్పాక నరేంద్ర మోదీ నవంబర్ 8న సెన్సేషనల్ డిసీషన్ ప్రకటించారు. ఆ తరువాత జరిగింది, జరుగుతోంది అంతా మనకు తెలిసిందే! అయితే, హస్ముఖ్ మీద మోదీకి ఎంత నమ్మకమంటే, ఆయన చెప్పిన విధంగా నోట్లు రద్దు చేయదలుచుకున్న ప్రధాని అంతకు ముందు క్యాబినేట్ మీటింగ్లో ఎలాంటి దుష్పరిణామాలు వచ్చినా నాది బాధ్యతంటూ ఇతర మంత్రులకి చెప్పారట! ఇక్కడ మరో కొసమెరుపు ఏంటంటే, ఏదైనా మీటింగ్లో నమో, హస్ముఖ్ చాలా కీలకమైన అంశాలు చర్చించాల్సి వస్తే గుజరాతీ భాషలో మాట్లాడేసుకుంటూ వుంటారట! మొత్తానికి... భాష, భావం రెండూ కలిసిన హస్ముఖ్... ముందు ముందు పీఎం చేత ఇంకెన్ని సంచలన నిర్ణయాలు చేయిస్తాడో!