ఒమిక్రాన్ పుట్టుకకు హెచ్ఐవీకి లింక్?

కరోనా, డెల్టా వేరియంట్లు ప్రపంచాన్ని అతలాకుతం చేసేశాయి. కరోనా తీవ్రత కాస్త తగ్గడంతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది ప్రపంచం. ఇంతలోనే పులి మీద పుట్ర అన్నట్లు ప్రపంచ దేశాల్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరింత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 90 దేశాలకు పైగా ఒమిక్రాన్ వైరస్ వ్యాపించింది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ మూలాల్లో అత్యంత ప్రమాదకరమైన ఎయిడ్స్ వ్యాధి ఉందట. ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుకకు హ్యూమన్ ఇమ్యూనో డెఫిసియన్సీ వైరస్ (హైచ్ఐవీ) కారణం అని దక్షిణాఫ్రికా పరిశోధకులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీంతో జనంలో ఆందోళన మరింత పెరుగుతోంది.

ఒమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికాలో ముందుగా బయటపడింది. అయితే.. అది ఎలా పుట్టుకొచ్చింది? అనే దానిపై మాత్రం ఎవరూ స్పష్టత ఇవ్వలేకపోయారు. కరోనా వైరస్ నుంచి ఒమిక్రాన్ గా ఎలా రూపాంతరం చెందింది అనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. దాంతో పాటుగా ఒమిక్రాన్ కు ఇతర లక్షణాలు ఏవైనా ఉన్నాయా? అని తెలుసుకునేందుకు కూడా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పరిశోధకులు మరింత ఆందోళన కలిగించే వివరాలు వెల్లడించారు. ఒమిక్రాన్ మూలంలో హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ తో సంబంధాలు ఉండే అవకాశాలు లేకపోలేదని వారు ఓ నిర్ధారణకు వచ్చారు. హెచ్ఐవీ సోకిన మహిళకు కరోనా సోకిందని, దాంతో కరోనా వైరస్ లో మార్పులు జరిగి ఒమిక్రాన్ గా రూపాంతరం చెంది ఉండే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే.. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.

దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల పరిశోధనలను ప్రస్తావిస్తూ.. ఒమిక్రాన్ కు హెచ్ఐవీకీ సంబంధం ఉందని చెబుతున్న శాస్త్రవేత్తల అభిప్రాయాలు అత్యంత ఆమోదయోగ్యంగా ఉన్నాయట. ఈ విషయాన్ని బీబీసీ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. కేంబ్రిడ్జి యూనివర్శిటీకి చెందిన డాక్టర్ కెంప్ బృందం కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. హెచ్ఐవీ ఉన్నవారిలో కరోనా విజృంభించేందుకు చాలా అనుకూల పరిస్థితులు ఉంటాయని కెంప్ బృందం తెలిపింది. దక్షిణాఫ్రికాలో హెచ్ఐవీ బాధితులు ఎక్కువగా ఉన్నందున అక్కడే కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ గా మారి ఉండవచ్చని కెంప్ టీం అంచనా వేసింది.

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న కొందరిలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించడం ఆందోళన కలిగించే అంశమే. ఒమిక్రాన్ కు ఇంత శక్తి ఎలా వచ్చింది? ఎందుకు అంత వేగంగా విస్తరిస్తోంది అనే ప్రశ్నలకు జవాబు ప్రస్తుతానికైతే దొరకడం లేదు. ఏదైనా అనుమానం వస్తే.. దాని అంతు తేల్చే వరకు శాస్త్రవేత్తలు చూస్తూ కూర్చోరు. దానికి కారణాలు ఏంటి అనే వాటికి జవాబులు రాబట్టే వరకూ నిద్రపోరు. అలా చేసిన పరిశోధనల కారణంగానే ఒమిక్రాన్ మూలాల్లో హెచ్ఐవీ ఉందనే విషయం వెల్లడైంది. కాగా.. దక్షిణాఫ్రికా పరిశోధకులు ఇప్పుడు ఒమిక్రాన్ కూ హెచ్ఐవీలో మూలాలు ఉండొచ్చనే దానిపై మరింత నిశితంగా.. లోతుగా అధ్యయనం చేస్తున్నారు.

ఇలా ఉండగా.. ఒమిక్రాన్ వేరియంట్ అందరి అంచనాలకు మించి చాలా కాలం పాటు ఉనికిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతుండడం గమనార్హం.