బాలినేని భవిష్యత్తు.. ఇక బందరు బస్టాండేనా?

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఎపిసోడ్‌ కారణంగా రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అవుతుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై పలు ఆరోపణలు ఉన్నాయి... కానీ అవి సుబ్బారావు గుప్తా ఇష్యూ అంత రచ్చ కాలేదని.. అవి పూర్తిగా పోలిటికల్ సర్కిల్‌కే పరిమితమైయ్యాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాని సుబ్బారావు గుప్తా విషయంలో బాలినేనితోపాటు ఆయన అనుచరులు వ్యవహరించిన తీరుపై తెలుగు ప్రజలు గుర్రుగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

నిజాయితీగా వ్యాపారం చేసుకునే సుబ్బారావు గుప్తా.. బాలినేని శ్రీనివాసరెడ్డికి అనుచరుడుగా.. ఫ్యాన్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. మంత్రి వాసన్న జన్మదినం సందర్భంగా గుప్తా చేసిన కామెంట్లు.. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడం.. ఆ తర్వాత సుబ్బారావు గుప్తాపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుడు సుభానీ దాడి చేసి బండ బూతులు తిట్టడం.. సుబ్బారావుని మొకాళ్ల మీద కూర్చోబెట్టి.. మంత్రి బాలినేని వాసన్నకు క్షమాపణలు చెప్పిచడం వరకు చోటు చేసుకున్న ఎపిసోడ్ అంతా అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌పై మంత్రి వాసన్న.. ఓ ప్రెస్ మీట్ పెట్టి.. సుబ్బారావు గుప్తా విషయంలో ఇలా జరిగి ఉండాల్సింది కాదంటూ.. కొద్దిగా సన్నాయి నొక్కులు నొక్కినా సరిపోయేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. జరగాల్సిందంతా జరిగి పోయిన తర్వాత... సుబ్బారావు గుప్తాను మంత్రి వాసన్న విజయవాడ పిలుపించుకుని.. సుబ్బారావు కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడారంటూ మీడియోలో వైరల్ అయింది. అయితే బాలినేని నివాసంలో సీఎం జగన్ జన్మదిన వేడుక సందర్భంగా మంత్రి వాసన్నే స్వయంగా కేక్ కట్ చేసి.. సుబ్బారావు గుప్తాకు తినిపించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

అయితే మంత్రి వాసన్న ఇలా వ్యవహరించడం కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే అని రాజకీయ విశ్లేకులు స్పష్టం చేస్తున్నారు. అలాగే బాలినేని మరో అనుచరుడు, ఫ్యాన్ పార్టీ మైనారిటీ నాయకుడు సుబానీపై పోలీసులు కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత అతడు స్టేషన్ బెయిల్‌పై విడుదల కావడం కూడా మంత్రి వాసన్న తెర వెనుక రాజకీయంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బాధితుడు సుబ్బారావు గుప్తా.. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ పోలీసులను డిమాండ్ చేయడం కొసమెరుపు. మంత్రి గారు అభయ హస్తం ఇస్తే.. బాధితుడు ఇలా పోలీసులను ఎందుకు ఆశ్రయిస్తాడని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.     
  
మరో వైపు సుబ్బరావు గుప్తాపై దాడిని ఆర్య వైశ్య నాయకులు సైతం ఖండిస్తున్నారు. ఆ సంఘం నేతలు పలువురు ఇప్పటికే గుప్తాని ఆయన కుటుంబ సభ్యులను సైతం పరామర్శించారు. సుబ్బారావుకు తొలుత దెబ్బలు రుచి చూపించి.. ఆ తర్వాత కేకు తినిపించి.. కేకు రుచి చూపించారంటూ ఈ ఎపిసోడ్‌పై సోషల్ మీడియాలో టాక్ వైరల్ అవుతోంది. గతంలో బాలినేని మంత్రిగా పని చేశారు. కానీ నాడు ఆయనపై అంతగా ఆరోపణలు లేవన్న సంగతి తెలిసిందే. కానీ రెండో సారి ఆయన ఏమంటా మంత్రి పదవి చేపట్టారో.. నాటి నుంచి ఆయనపై సమస్యలు.. విమర్శులు సైతం ముసురుకున్నాయి. మంత్రి పదవి చేపట్టిన కొద్ది రోజులకే ఆయన పీఏ ఏకంగా . మంత్రి వాసన్న సంతకం ఫోర్జరీ చేసి బదిలీల సిఫార్సు లేఖలు ఇచ్చిన వ్యవహారం నాడు పెద్ద దుమారాన్నే రేపింది. అలాగే గతేడాది ఒంగోలుకు చెందిన ఫ్యాన్ పార్టీ నేత ఒకరు ఆరు కోట్ల రూపాయిల నగదు తరలిస్తూ.. చెన్నై సరిహద్దుల్లో పోలీసులకు దొరికిపోయాడు. అయితే సదరు సొమ్ము బాలినేని వాసన్న హవాలా సొమ్ము అంటూ ప్రతిపక్షాలు నానాయాగీ చేసి వదిలాయి. ఆ సొమ్ము తనది కాదని మంత్రి వాసన్న స్పష్టం చేసినా.. విపక్షాలు.. మాత్రం ఆయనపై విమర్శలు ఆపలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

ఇక ఒంగోలు నగర శివారులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భూ ఆక్రమణలకు తెర తీశారు. దీని వెనక బాలినేని హస్తం ఉందంటూ స్థానికంగా పెద్ద ప్రచారం జరిగింది... జరుగుతోంది. బాలినేని ఇమేజ్‌ను ఇవన్నీ కొద్దో గోప్పో డ్యామేజ్ చేస్తే.. సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ మాత్రం మంత్రి వాసన్న పోలిటికల్ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఈ మొత్తం ఏపిసోడ్‌తో మంత్రి బాలినేని వాసన్న రాజకీయ భవిష్యత్తు.. ఇక బందరు బస్టాండేనన్న టాక్ సోషల్ మీడియా సాక్షిగా జోరుగా వైరల్ అవుతోంది.