అమ్మ ప్రేమ అజరామం!!

పెదవే పలికిన మాటల్లోనా తియ్యని మాటే అమ్మ అనే పాట పాడుతూ ఉంటే అమ్మ ప్రేమ అంతా చిన్నతనంలో మనల్ని ముంచెత్తిన పాలబువ్వతో సహా మళ్ళీ ఉయ్యాల ఊపినంత హాయిని కలిగిస్తుంది. 

ఎవరు రాయగలరూ అమ్మా అను మాట కన్నా కమ్మని కావ్యం అనే పాట మొత్తం వింటే బ్రహ్మకు కూడా అమ్మ ప్రేమ గొప్ప వరమే అని అర్థమవుతుంది. 

సినిమాలలోనూ, కవితల్లోనూ, కథల్లోనూ ఇంకా మనుషుల జీవితలలోనూ ఎక్కడ చూసినా అమ్మ ప్రేమకు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి, ఉన్నాయి కూడా. కానీ అమ్మకు అందుతున్న బహుమానం ఏమిటి??

ఆలోచిస్తే ఏమీ ఉండదు!! కనీసం అమ్మ కోసం ఏదైనా ఇచ్చినా అదంతా అమ్మ తన పిల్లలకు పంచిన ప్రేమకు సరితూగుతుందా?? ప్రశ్నార్ధకమే!!

పైకి అమ్మను ఇంతగా ఆకాశానికి ఎత్తేసే మహామహులు అందరూ లోపల మాత్రం నిజంగా అంత ప్రేమగా, గౌరవంగా చూస్తుంటారా?? 

కేవలం అమ్మల్నే కాదు నాన్నల్ని కూడా ప్రేమగా చూడని పుత్రులు, పుత్రికలు పుష్కలంగా ఉన్న భారతదేశం ఇది. అయితే అమ్మానాన్నల్లో కూడా లింగవివక్షత ఎదుర్కొనేది, ఇది నాది అని ప్రత్యేకంగా దేనిగురించి చెప్పుకోలేని వ్యక్తి మాత్రం అమ్మే. నిజానికి పెళ్ళైన ప్రతి ఆడదానికి ఇలాంటి పరిస్థితే ఉంటుంది. అయితే పిల్లలు పుట్టి, వలలు పెద్దయ్యి రెక్కలు వచ్చి ఎగిరిపోయాక, మరొక గూడు కట్టుకుని మరో కుటుంబాన్ని వాళ్లకోసం ఏర్పాటు చేసుకున్నాక అక్కడే నిజమైన కష్టాలు కానీ, నిజమైన సంతోషం కానీ ఎదురవుతుందేమో అమ్మలకు. 

పిల్లలకు పుట్టిన పిల్లలంటే ప్రేమ, అన్నేళ్ళు కనిపెంచిన పిల్లలు మరొకరితో జీవితం పంచుకుంటూ సరిగ్గా ఉన్నారో లేదో అని బెంగ, కొడుకు కొడలితో ఉంటూ తనని ఎక్కడ మర్చిపోతాడో అనే ఇంసెక్యూరిటీ ఫీలింగ్, మనవళ్లు, మనవరాళ్లు పుట్టిన తరువాత పిల్లల్ని ముసలివాళ్ళ దగ్గరకు పంపలేని కొందరి కోడళ్ల స్వభావం, ఏముంది ఆ ముసలివాళ్ళ దగ్గర అనే చిన్నతనం. జీవితంలో ఎదుగుదలకు అడ్డంకి అనే ఒకానొక మూర్ఖత్వపు ఆలోచన. ఇలా కారణాలు ఏమైనా సరే సమాజంలో ఎన్నో కుటుంబాలలో ఎంతో మంది అమ్మలు మానసికంగా నలిగిపోతున్నారు.

ఉద్యోగం చేసే మహిళ అయినా, వంటిట్లో హడావిడి పడే మహిళ అయినా, ప్రతిరోజూ కూలి పనికి వెళ్లి సంపాదించే మహిళ అయినా ఇలా పనులు ఏవైనా అమ్మ మాత్రం మొదట తన పిల్లల గురించి వాళ్ళ బాగోగుల గురించి ఆలోచిస్తుంది. వాళ్ళను తనకు చేతనైనంత గొప్పగా పెంచాలని అనికుంటుంది. తన బిడ్డలు ఎంతో గొప్ప స్థాయికి వెళ్లాలని కలలు కంటుంది. గొప్ప విజయాలు తన బిడ్డలు సాదించినప్పుడు ఆ విజయాలు అన్నీ తనవే అయినట్టు చిన్నపిల్లలా సంతోషపడుతుంది. అలాంటి అమ్మ మాత్రం చివరకు పిల్లల చేతుల్లో నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. 

మనిషికి కొత్త ప్రపంచాలు పరిచయం అయ్యే కొద్దీ అమ్మ ఒక పాత ప్రపంచం అవుతుందేమో అనిపిస్తుంది కొందరు ప్రవర్తించే తీరు చూస్తే. కానీ అమ్మ లేకుంటే పుట్టుక, చదువులు, గొప్ప విజయాలు ఇవేవీ సాధ్యమయ్యేవి కాదని అందరూ ఎందుకు గుర్తుచేసుకోరో….. 

జీవితంలో అందరికీ ఒక్కో దశలో ఒక్కో విధంగా ఎన్నో ప్రపంచాలు పరిచయం అవుతూ ఉన్నా అమ్మను, అమ్మ ప్రేమను, అమ్మ బిడ్డను చూసుకునే బాధ్యతను మాత్రం వేరే ఎవరూ రీప్లేస్ గా చూడలేరు. ఇంకా చెప్పాలంటే జీవితంలో మధ్యలో ఎంట్రీ ఇచ్చే లైఫ్ పార్టనర్ కూడా తనకు బిడ్డ పుట్టగానే భర్త కంటే బిడ్డనే ఎక్కువగా చూస్తుంది. భర్త కోపం నుండి బిడ్డను కాపాడుకుంటుంది. బిడ్డ అలిగితే బుజ్జగిస్తుంది, కోపం పోగొట్టేలా ఎన్నో కథలు చెబుతుంది. చివరకు తన బిడ్డ పెద్దగయ్యి పెళ్లి చేసుకున్నా తన బిడ్డకోసం ఏదైనా చేస్తుంది. 

కాబట్టి ఇక్కడ అర్థమయ్యేది ఒకటే. జీవితంలో కొత్త బంధాలతో ఒకటైనా అవన్నీ ఒక ఆడదానికి బిడ్డ పుట్టగానే చిన్నబోతాయి. ఈ ప్రపంచంలో ఎప్పుడూ తల్లీ-బిడ్డల అనుబంధమే మొదలు నుండి చివరి వరకు అలా సాగుతుంది. చాలా వరకు గమనిస్తే ప్రతి ఇంట్లోనూ భర్తల కంటే బిడ్డల్ని ప్రేమించే ఆడవాళ్లే ఎక్కువ. 

అమ్మకు బిడ్డలంటే ప్రాణం. ప్రాణం పణంగా పెట్టి కనింది కదా!! మరి అలా కాకుండా ఎలా ఉంటుంది?? పెళ్ళైన వాళ్ళ విషయంలో అయినా ముసలితనంలోకి జారుకున్న వాళ్ళ విషయంలో అయినా అమ్మ, అమ్మ ప్రేమ, అమ్మ ఆరాటం ఉంటూనే ఉంటుంది. 

పగలంతా సూర్యుడిలానూ….

రాత్రంతా చంద్రుడిలానూ….

నడిపించే కాలంలానూ…..

అమ్మ ఎప్పుడూ ఒక బలంగా వెంట ఉంటుంది. అలాంటి అమ్మకు జోహార్లు….

 ◆వెంకటేష్ పువ్వాడ.