ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే మీద దాడి చేసిన వైసీపీ నేతలు

 

ఏపీలో తెలుగుదేశం వైసీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటికి నిన్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యేని వైసీపీ నేతలు చెప్పులు విసిరి దాడి చేయగా ఈరోజు మరో ఎమ్మెల్యే మీద దాడి చేశారు. ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గంలో జరుగుతున్న రైతు భరోసా కార్యక్రమానికి వెళ్లిన స్థానిక తెదేపా ఎమ్మెల్యే డాక్టర్. డోలా బాల వీరాంజనేయ స్వామిపై వైకాపా కార్యకర్తలు దాడిచేశారు. ప్రొటోకాల్ ప్రకారం తాను హాజరవ్వాలని ముందుగానే పోలీసులకు, అధికారులకు తెలియజేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ దాడి జరిగినట్టు చెబుతున్నారు. 

తెదేపా హయాంలో జరిగిన అధికారిక కార్యక్రమాలకి పార్టీతో సంబంధం లేకుండా ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలను ఆహ్వానించామని, ఎవరిపై వివక్షత చూపలేదని తెలుగుదేశం చెబుతోంది. కానీ ఇప్పుడు మాత్రం ప్రొటోకాల్ అనుసరించవలసిన ప్రభుత్వాధికారులు, దానిని పక్కనపెట్టి అధికారపార్టీ కార్యకర్తలకు వత్తాసుపలకడం ప్రజాస్వామ్యానికి అవమానకరమని తెలుగుదేశం పేర్కొంది. పోలీసులు ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యంకాదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి కార్యక్రమం నుండి వెనుదిరిగారని సమాచారం. ప్రజాప్రతినిధికే ఇలా జరిగితే ఇంక సామాన్య ప్రజానీకానికి ఇంకెన్ని జరుగుతాయోనని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.