అంతా సద్దుమణిగిందన్న కుమారస్వామి....సిద్దరామయ్యే కుట్రదారు ?

 

కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలకి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ముంబై వెళ్లి హైడ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకుందామని చూసినా అది సాధ్యం అయ్యేలాగా కనిపించడం లేదు. అందుకు అనుగుణంగా పావులు కదిపిన కాంగ్రెస్-జేడీఎస్ ట్రబుల్ షూటర్లు ఈ సమస్యను సాల్వ్ చేసినట్టే కనిపిస్తోంది. తాజాగా అదే విషయాన్ని సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు. 

ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, పరిస్థితి అంతా చక్కబడిందని అన్నారు. జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా, కూటమికి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రాజీనామా చేయడంతో కర్ణాటక సర్కారు సంక్షోభంలో పడినట్టు శనివారం నుండి వార్తలు సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన అసంతృప్తులు ముంబయి వెళ్లి ఓ హోటల్ లో మకాం వేసి కర్ణాటక రాజకీయాలను ఒక కుదుపు కుదిపేశారు. 

చివరికి కాంగ్రెస్ మంత్రులు తమ పదవులను అసంతృప్తులకు త్యాగం చేసేందుకు సిద్దమయ్యారు. రాజీనామా చేసినట్టు కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో, సమస్య పరిష్కారమైందంటూ కుమారస్వామి వ్యాఖ్యలు చేయడంతో వారు నిజంగానే రాజీనామా చేశారా ? లేక వీరే ఒప్పుకున్నారో తెలియాల్సి ఉంది. అయితే ఈ సంక్షోభం మీద కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తనదైన శైలిలో స్పందించారు. మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం నుంచి ఎవరూ ముఖ్యమంత్రిగా ఉండకూడదన్న ఉద్దేశంతోనే మాజీ సీఎం సిద్ధరామయ్య కల్లోలానికి ప్రణాళికలు రచించాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుండి డిప్యూటీ సీఎంగా ఉన్న పరమేశ్వర ఎదగడం కూడా సిద్ధరామయ్యకు ఇష్టంలేదని అందుకే ఈ సంక్షోభానికి తెరలేపాడని, అయితే పరిస్థితులు ఆయన చేతులు కూడా దాటిపోయాయని పేర్కొన్నారు.