తెలంగాణ రాజకీయాలు.. ఓవర్ టూ ఢిల్లీ !

తెలంగాణ రాజకీయాలు ఇప్పడు ఢిల్లీ చేరుకున్నాయా?  జంతర్ - మంతర్ నుంచి పార్లమెంట్ వరకు తెలంగాణ రాజకీయాలకు వేదికగా మారుతున్నాయా? అంటే  మంగళవారం (ఏప్రిల్ 1)  దేశ రాజధాని ఢిల్లీ వేదికగా చోటు చేసుకున్న విభిన్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అవును రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టిస్తున్న బీసీ రిజర్వేషన్, హెచ్‌సీయూ భూమల విక్రయం, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, మంత్రివర్గ విస్తరణకి సంబందించిన అనేక కీలక అంశాలు బుధవారం ( ఏప్రిల్ 2)  ఢిల్లీలో సందడి చేశాయి. 

ఓ వంక లోక్ సభలో అత్యంత కీలకమైన, అంతకు మించి అత్యంత వివాదస్పదమైన వక్ఫ్ సవరణ బిల్లు పై వాడివేడి చర్చ జరుగతున్న సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జంతర్ మంతర్ నుంచి ‘మోదీ దిగిరావాలని’ డిమాండ్ చేశారు. లేదంటే దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం, దేశాన్ని జాగృతం చేస్తాం, బీజేపీని బూడిద చేస్తాం అంటూ గర్జించారు. హెచ్చరించారు. అయితే  రేవంత్ రెడ్డి గర్జించింది వక్ఫ్ సవరణ బిల్లు విషయంగా కాదు.  విద్య, ఉద్యోగాలతోపాటు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లులను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ బుధవారం (ఏప్రిల్ 2) ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించిన  బీసీ పోరుగర్జన సభలో రేవంత్‌ రెడ్డి ఈ గర్జన చేశారు. రేవంత్ రెడ్డి గర్జనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాజ్యసభ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు  లక్ష్మణ్  అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చారు.  మీ మంత్రి వర్గంలో 46 శాతం బీసీలు ఉన్నారా?  అంటూ  కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అంతే  కాదు  బీసీలకు 42 రిజర్వేషన్ కల్పిస్తామని బిల్లు చేసి మరీ అసెంబ్లీకి ఇచ్చిన హామీ నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాల ముసుగులో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారని కిషన్ రెడ్డి  కౌంటర్ ఆరోపణ చేశారు.

రేవంత్ రెడ్డి గర్జన, కిషన్ రెడ్డి కౌంటర్ స్పందన.. ఇతర పరస్పర ఆరోపణల పర్యవసానాలు, ఫలితాలు ఎలా ఉంటాయి అనేది పక్కన పెడితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జంతర్ మంతర్  వద్ద గర్జన చేస్తున్న సమయంలోనే లేదంటే కొంచెం అటూ ఇటుగా రాజ్యసభలో  హెచ్‌సీయూ భూమల అమ్మకం వ్యవహారం రాజ్యసభలో ప్రకంపనలు సృష్టించింది. బీఆర్ఎస్ పక్ష నేత కేఆర్ సురేష్ రెడ్డి  రాష్ట్రంలో  రోజు రోజుకు రాజకీయ వేడిని పెంచుతున్న హెచ్‌సీయూ భూమల విక్రయం  అంశాన్ని సభలో ప్రస్తావించారు. రాజ్యసభ జీరో అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన సురేష్ రెడ్డి, అరుదైన పశుపక్షాదులకు ఆవాసంగా ఉన్న కంచ గచ్చిబౌలి  లోని 400 ఎకరాల భూమి విక్రయానికి వ్యతిరేకంగా విద్యార్ధులు చేస్తున్న ఆందోళనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రభుత్వం  అమానుషంగా, అత్యంత క్రూరంగా అణచి వేస్తోందని ఆరోపించారు. అలాగే  బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న భూముల విక్రయ నిర్ణయం వలన విద్యార్ధుల భవిష్యత్ దెబ్బతినడమే కాకుండా, పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తుందని అన్నారు. అంతకు ముందు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి వినతి పత్రం సమర్పించింది. 

మరో వంక  ఇదే అంశంపై ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వద్ద బీజేపీ ఎంపీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ తో పాటుగా గోడం నగేష్‌, రఘునందన్‌రావు, డీకే అరుణ, కొండా,బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ హెచ్‌సీయూ భూములను అమ్మితే సహించేంది లేదని, తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హెచ్‌సీయూ భూమల వేలాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 

అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ ఎంపీలు కేంద్ర అటవీ,పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిసి, యూనివర్సిటీ భూములు విక్రయిస్తే పర్యావరణ పరంగా ఎదురయ్యే అనర్ధాలను వివరించారు. అటవీ, వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. బీజేపే ఎంపీల విజ్ఞప్తి మేరకు  కేంద్ర అటవీ సంరక్షణ శాఖ, వివాదాస్పద కంచ గచ్చిబౌలి భులకు సమబందించిన సమగ్ర నివేదికని తక్షణం పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇలా రాష్ట్ర రాజకీయాలు బుధవారం (ఏప్రిల్ 2) ఢిల్లీలో వేడిని పుట్టించాయి. 

నిజానికి ఇవన్నీ ఒకెత్తు అయితే.. తెలంగాణ రాజకీయం ఢిల్లీలో వీరంగం వేస్తున్న సమయంలోనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెత్తిన దేశ సర్వోన్నత న్యాయస్థానం అక్షింతలు వేసింది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న సుప్రీం కోర్టు, మళ్ళీ మరోమారు అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగా హెచ్చరించింది.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పై స్పీకర్ నాలుగేళ్లు చర్యలు తీసుకోకున్నా సుప్రీం కోర్టు చేతులు కట్టుకుని కుర్చోవాలా  అని ఘాటుగా వ్యాఖ్యానించింది. 
గత ప్రభుత్వ హయాంలో పార్టీ ఫిరాయించిన వారి విషయంలో ఏమి జరిగిందో, ఇప్పుడూ అదే జరుగుతుంది, అనర్హత వేటు పడదు, ఉప ఎన్నికలు రావు అంటూ  ముఖ్యమంత్రి రెంత్ రెడ్డి, రాష్ట శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో, చేసిన వ్యాఖ్యలను సుప్రీం  కోర్టు తప్పు పట్టింది. నిండు సభలో ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలు చేసింది నిజమే అయితే..  రాజ్యాంగంలోని 10వ షెడ్యూలును అపహాస్యం చేయడం కిందికే వస్తుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

బీఆర్‌ఎస్‌ నుంచి అధికార అధికార కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై బుధవారం సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా  బీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వొకేట్‌ ఆర్యామ సుందరం.. మార్చి 26న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఫిరాయింపుల  వ్యవహారం కూడా ఢిల్లీ ఖాతాలో  చేరింది. 

ఇలా ఒక దానివెంట ఒకటి,  రాష్ట్ర రాజకీయాలు,  యాధృచ్ఛికమే అయినా ప్రస్తుతానికి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే  ఢిల్లీ సీన్ ఢిల్లీలో సాగుతుంటే రాష్ట్రంలోనూ రాజకీయ ఉష్ణోగ్రతలు ఎండలతో పోటీ పడి పరుగులు తీస్తున్నాయి.