నాగబాబు పర్యటనలో పిఠాపురం వర్మ అనుకూల నినాదాలు

ఎమ్మెల్సీగా  నాగబాబు తన తొలి అధికారిక పర్యటన పిఠాపురం నియోజకవర్గం నుంచే మొదలు పెట్టారు. జనసేన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మొట్టమొదటి సారిగా అధికారికంగా పిఠాపురం నియోజకకవర్గంలో శుక్రవారం (ఏప్రిల్ 4) పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నియోజకవర్గ పరిధిలోని గోల్లప్రోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్న క్యాంటీన్ లను ప్రారంభించారు.

ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ఈ సందర్భంగా నియోజకవర్గంలో తెలుగుదశం, జనసేన ల మధ్య ఉన్న విభేదాలు ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. నాగబాబు సమక్షంలో ఇరు పార్టీల కార్యకర్తలు పోటీపోటీగా నినాదాలు చేశారు. జనసేన శ్రేణులు జై జనసేన అంటూ నినాదాలు చేయగా తెలుగుదేశం వర్గీయుల నుంచి పెద్ద పెట్టున జై వర్మ అంటూ పిఠాపురం వర్మకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇటీవల జనసేన ఆవిర్భాత సభలో నాగబాబు వర్మకు సంబంధించి ఒకింత వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం శ్రేణులకు ఆగ్రహం కలిగించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు తాజాగా నాగబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో పిఠాపురం వర్మ ఫొటో లేకపోవడంతో తెలుగుదేశం శ్రేణులు పిఠాపురం వర్మకు అనుకూలంగా  నాగబాబు సమక్షంలో నినాదాలు చేశారు. పైగా నాగబాబు నియోజకవర్గ పరిధిలో చేసిన ప్రారంభోత్సవాలకు వర్మకు ఆహ్వానం లేదని కూడా అంటున్నారు. మొత్తం మీద పిఠాపురంలో నాగబాబు తొలి సారిగా జరిపిన పర్యటన నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం మధ్య విభేదాలను బయటపెట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.