జగిత్యాల పర్యటనతో కవిత రీ ఎంట్రీ?
posted on Dec 15, 2024 6:50PM
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. లిక్కర్ స్కాంలో తీహార్ జైల్లో ఉన్న ఆమె బెయిల్ పై విడుదలైన తర్వాత తొలి పర్యటన ఇదే. జైలు నుంచి విడుదలయ్యాక ఆమె పెద్దగా రాజకీయాల పట్ల ఆసక్తికనబరచలేదు. తెలంగాణలో పెద్ద పండుగ అయిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారని తొలుత ప్రచారం జరిగినప్పటికీ ఆమె బయటకు రాలేదు. బిఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ గా వెలిగారు. జాగృతి సంస్థ ద్వారా ఆమె రాజకీయాలకు పరిచయమయ్యారు. ఇటీవలె సచివాలయంలో బతుకమ్మ విగ్రహావిష్కరణ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. బతుకమ్మ లేకుండానే తెలంగాణ తల్లి రూపకల్పన జరిగిందన్నారు. కవిత రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇ చ్చినట్లేనని బిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. జైలు నుంచి విడుదలైన ఇన్నిరోజుల తర్వాత ప్రజల్లోకి రావడం వెనక కారణమేమిటని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియా నుంచి తప్పించుకున్న ఆమె సడెన్ గా జగిత్యాలలో ప్రత్యక్షం కావడం ఆసక్తికరంగా మారింది. ఈ యేడు ఏప్రిల్ లో కవిత మీద ఈడీ కేసు నమోదు అయిన తర్వాత ఒకసారి జగిత్యాలో పర్యటించారు. మళ్లీ జగిత్యాలకు రాలేదు. అప్పట్లో కవితకు వ్యతరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఆ పర్యటన తర్వాతే ఆమె లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నారు. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. బిఆర్ఎస్ కేడర్ లేకపోవడంతో కవిత ఒకింత ఇబ్బంది పడ్డారు.