కేసీఆర్ ను భయపెడుతున్న ఫేస్ బుక్

 

రాష్ట్ర రాజకీయపార్టీలు తమ ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు ఇప్పుడు సరికొత్త ఎత్తులు, జిత్తులు ప్రదర్శిస్తున్నాయి. కొన్ని నెలలక్రితం తెరాస, వైకాపాలు ఫలానా ఫలానావారు కాంగ్రెస్ తెదేపాలలోనుండి మా పార్టీలో త్వరలో చేరనున్నారని ప్రకటించి ఆ పార్టీలతో మైండ్ గేం మొదలుపెట్టాయి. తద్వారా సదరు పార్టీలలో కలకలం, అనుమానాలు చెలరేగాయి. ఈ మైండ్ గేం బాధితులు కొందరు మీడియా ముందు కన్నీరు కూడా పెట్టుకొన్నారు.

 

ఆ తరువాత, వైకాపా ఫ్లెక్సీ బ్యానర్ వ్యూహంతో తెదేపాతో చెలగాటం ఆడుకొంది. నిన్న గాక మొన్న పుట్టిన ఒక చిన్న పార్టీ విసిరిన చిన్నపాచికకే ౩౦ సం.ల సుదీర్ఘ చరిత్ర ఉన్నతెదేపా ఈవిధంగా చిత్తయిపోవడం చూసి అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. నేటికీ, తెదేపాలో ఆ వేడి ఇంకా చల్లారనే లేదు. వైకాపా తన ఆట ముగించినప్పటికీ నందమూరి సోదరులు మాత్రం ఒకరిపై మరొకరు ఇంకా కత్తులు దూసుకొంటూనే ఉన్నారు.

 

రాజకీయ యుద్ధాలకు ఇంటర్ నెట్ వేదికగా మరి చాలా కాలమే అయినప్పటికీ, దానిని పూర్తి స్థాయిలో ఇంతవరకు ఏ పార్టీ కూడా ఉపయోగించుకోలేదు. అప్పుడప్పుడు తెదేప యువనేత లోకేష్ మాత్రం వైకాపాను ఎండగట్టడానికి తన ట్వీటర్ ద్వారా అస్త్రాలు సందిస్తుండటం అందరు ఎరిగినదే.

 

ఇప్పుడు తెరాస పార్టీని ఇరుకున పెట్టేందుకు ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి లేదా వ్యక్తులు ఆ పార్టీ అధినేత చంద్రశేఖర రావు పేరుతో ఒక ఫేస్‌బుక్ అకౌంట్ సృష్టించడమే కాకుండా, అందులో రాబోయే ఎన్నికల కోసం దాదాపు నలభై మంది పార్టీ అభ్యర్ధుల పేర్లను కూడా ప్రకటించడంతో తెరాసలో కలకలం మొదలయింది. పరకాల, స్టేషన్ ఘనపూర్ ఎల్లారెడ్డి, సిర్పూర్ కాగజ్ నగర్ సిట్టింగ్ శాసన సభ్యుల పేర్లు ఫేస్‍‌బుక్‌లో పెట్టిన లిస్టులో లేవు.

 

అదే విధంగా మెదక్ నుండి కేసీఆర్ పోటీ చేయనున్నాడని పుకార్లు చెలరేగుతున్న నేపద్యంలో మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి పేరు కూడా లిస్టులో లేకపోవడంతో ఒక్కసారిగా పార్టీలో తీవ్ర ఉద్రిక్తతలు మొదలయ్యాయి.

 

ఈ విషయం తెలుసుకొన్న కేసీఆర్ ఆ తెలియని వ్యక్తుల మీద తీవ్రంగా మండి పడ్డారు. అసలు తనకు ఫేస్‌బుక్ లో ఖాతాయే లేదని, ఎవరో కావాలనే తమ పార్టీని దెబ్బ తీయడానికి ఈ ప్రయత్నం చేసిఉండవచ్చని ఆయన అన్నారు. ఈ సంఘటనపై తాము సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆ పార్టీ పోలి బ్యూరో సభ్యుడు శ్రవణ్ మీడియాకు తెలిపారు.