సబిత కుర్చీలో బొత్స కర్చీఫ్

 

హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ చార్జ్ షీటు దాఖలు చేసినందున, ఇక ఆమె ఆ పదవిలో కొనసాగడం సబబుకాదనే భావన ఆమెకే కాకుండా, పార్టీలో, ప్రతిక్షపార్టీలలోకూడా బలంగా ఉన్నందున, ఇక రేపు సోనియా గాంధీ విదేశీపర్యటన ముగించుకొని డిల్లీ తిరిగి రాగానే కాంగ్రెస్ అధిష్టానం ఆమె విషయంలో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయి.

 

ఇదే విషయమై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గులాం నబీ ఆజాద్ తో చర్చించేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ డిల్లీ వెళ్ళారు. సబితా ఇంద్రారెడ్డి ఆ పదవిలోంచి తప్పుకోవడం దాదాపు ఖాయం అని గ్రహించిన ఆయన, ఇదే అదునుగా భావించి అధిష్టానం ఆదేశించినట్లు పీసీసీ అధ్యక్ష పదవి నుండి తప్పుకొంటునందున తనకు హోంమంత్రి పదవిని ఈయాలని ఆజాద్ ను కోరినట్లు సమాచారం. హోంమంత్రి కుర్చీలో ఇంకా ఎవరూ కర్చీఫ్ వేయక మునుపే డిల్లీ వెళ్ళిన బొత్స తెలివిగా ముందుగానే పావులు కదిపారు.

 

ఇక, బొత్ససత్యనారాయణ తను ముఖ్యమంత్రి కావాలనే కోరికను ఎన్నడూ దాచుకోలేదు. అవకాశం చిక్కినప్పుడల్లా ఆ ప్రసక్తి తెస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కావాలనే తన కోరిక తీర్చుకొనే అవకాశం ప్రస్తుతం ఎలాగు లేదు గనుక, తనకు హోంమంత్రి పదవితో బాటు ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇప్పించమని ఆయన ఆజాద్ ను కోరినట్లు సమాచారం. ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే రాహుల్ గాంధీ చేసిన ప్రతిపాదన వలన, పీసీసీ పదవి కోల్పోనున్న బొత్ససత్యనారాయణ ఇప్పుడు హోం మంత్రి పదవితో బాటు తనకు ఉపముఖ్యమంత్రి పదవి కూడా కావాలని కోరడం విశేషం.

 

అయితే, తను ఉపముఖ్యమంత్రి పదవి కోరుతున్నపటికీ, ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్న దామోదర రాజనరసింహను తొలగించి తనకు ఇమ్మని కోరడం లేదని, ఆయనతో బాటు తానూ కూడా ఉపముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలనుకొంటున్నట్లు చెప్పినట్లు తెలిసింది. ప్రస్తతం రాయలసీమ నుండి ముఖ్యమంత్రి, తెలంగాణ నుండి ఉపముఖ్యమంత్రి ఉన్నందున, తనకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆంధ్రా ప్రాంతానికి కూడా న్యాయం జరిగినట్లు ఉంటుందనే (లాజిక్ పాయింట్) ఆయన ఆజాద్ కు వివరించినట్లు సమాచారం.

 

ఆజాద్ ఈ విషయంలో ఆయనకు ఎటువంటి హామీలు ఈయనప్పటికీ, బొత్ససత్యనారాయణ తన మనసులో మాటను ‘సరయిన సమయంలో సరయిన చెవిలో’ పడేయగలిగారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును.

 

మరి, ఆయన కోరికను సోనియాగాంధీ మన్నిస్తారో లేదో తెలియదు కానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తీవ్రంగా వ్యతిరేఖించడం ఖాయం. ఆయన పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకే అభ్యంతరం తెలిపిన కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పటికే తనకు పక్కలో బల్లెంలా ఉన్నఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు తోడూ ఇప్పుడు బొత్ససత్యనారాయణను కూడా భరించేందుకు అంగీకరించకపోవచ్చును. అదేవిధంగా బొత్సకు హోంమంత్రి పదవికి ఆయన అభ్యంతరం తెలుపవచ్చును.

 

తనను వ్యతిరేఖించే ఇటువంటి నేతలతో కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సాధారణ ఎన్నికలను ఎదుర్కోవడానికి ఇష్టపడకపోవచ్చును. కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి మాటకే గనుక ప్రాధాన్యం ఇచ్చినట్లయితే, బొత్స తన రవాణా శాఖకే పరిమితమవవచ్చును. కానీ, తన కలలు కల్లలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన నిజంగానే పక్కలో బల్లెంగా మారవచ్చును. త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఎవరిమాటకు ఎంత విలువుందో తేలిపోవచ్చును.