బాబోయ్ మళ్లీ వర్షాలు!
posted on Nov 19, 2022 10:15PM
ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ వర్షాలు ముంచెత్తనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుందన వాతావరణ శాఖ శనివారం పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో శనివారం (నవంబర్ 19)తమిళనాడు, పుదుచ్చేరిలలో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోనూ చెదురుమదురు వర్షాలు కురిశాయి. అల్పపీడనం బలపడి ఆదివారం నాటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయనీ పేర్కొంది.
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు వేటకు వెళ్లరాదనీ హెచ్చరించింది. కాగా వాతావరణ తాజా హెచ్చరికతో రైతులలో ఆందోళన వ్యక్తం అవుతోంది. సాగు సమయంలో వర్షం పడితే చేతికి వచ్చే పంట నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులలో వరి కోతలు ప్రారంభం కానున్న తరుణంలో వాయుగుండం హెచ్చరికతో వారి గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి.