‘గాంత్’ వెబ్ సిరీస్ రివ్యూ

 

వెబ్ సిరీస్ : గాంత్ 
నటీనటులు: మనవ్ విజ్, సలోని బత్రా, మౌనిక పన్వార్, గౌరవ్ మిశ్రా, ప్రమోద్ చతుర్వేది,   సౌరభ్ పటేల్
ఎడిటింగ్:  సంజయ్ శర్మ
మ్యూజిక్: రాఘవ్-అర్జున్
సినిమాటోగ్రఫీ: ప్రతీక్ 
నిర్మాతలు: అంజిత్ అంధారే
దర్శకత్వం: కనిష్క్ వర్మ
ఓటీటీ: జియో సినిమా

కథ:

హకీకత్ నగర్ లో జతిన్ తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తుంటాడు. తన తండ్రి దశరథ్ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన జతిన్.. తండ్రి మరణంతో మానసికంగా దెబ్బతింటాడు. ఆ షాక్ వలన అతనికి మాటపోతుంది. చాలా కాలం తరువాత మాట వస్తుంది. ఆరుగురు కుటుంబసభ్యులతో జతిన్ ఫ్యామిలీ ఉండేవారు. అలాంటిది ఒకరోజు ఆ కుటుంబ సభ్యులంతా తెల్లవారేసరికి ఇంట్లోనే ఉరివేసుకుంటారు. దాంతో ఆ కాలనీ వాసులంతా భయపడిపోతారు. ఈ కేసును గదర్ సింగ్ (మనవ్ విజ్)కి అప్పగిస్తారు. పోలీస్ ఆఫీసర్ గా ఉన్న అతణ్ణి ఫ్యామిలీ వైపు నుంచి కొన్ని సమస్యలు వెంటాడుతుంటాయి. అతను తన కూతురు 'మినీ' తో కలిసి ఉండాలని కోరుకుంటాడు. ఆ సమస్యల కారణంగా అతను మద్యానికి మరింత బానిస అవుతాడు. ఆ కారణంగానే సస్పెండ్ అవుతాడు. అలాంటి గదర్ .. ఈ కేసును ఛేదించగలడని డిపార్టుమెంటువారు అతణ్ణి పిలుస్తారు. గదర్ ఉన్నపళంగా  సంఘటన స్థలానికి చేరుకుంటాడు. అతని టీమ్ గా ఆఫీసర్ సత్యవతి (సలోని బత్రా) , గొస్సేయిని (శ్రవణ్) అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఉరికి వ్రేలాడుతున్న ఆరుగురిలో .. పదేళ్ల కుర్రాడు 'కుశాగ్ర' బ్రతికే ఉండటం గమనించి వెంటనే అతణ్ణి హాస్పిటల్ కి తరలిస్తారు. ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న సాక్షి (మౌనిక) ఆ కుర్రాడి బాధ్యతను తీసుకుంటుంది. జతిన్ ఫ్యామిలీ గురించి గదర్ ఆ చుట్టు పక్కలవారిని ఆరాతీయడం మొదలుపెడతాడు. జతిన్ కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకుంటే, వాళ్ల కాళ్లు - చేతులు ఎలా కట్టేసి ఉంటాయి? వారు చనిపోవడానికి ముందే ఆ ఇంటి కుక్క ఎందుకు చనిపోతుంది? కొత్తగా ఆ ఇంటికి పైపులు .. సొరంగ మార్గాలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి? చనిపోవడానికి ముందు రోజున జతిన్ పెద్దమొత్తంలో డబ్బు ఎందుకు డ్రా చేశాడు? ఆ డబ్బును అతను ఎవరికి ఇచ్చాడనేది మిగతా కథ.


విశ్లేషణ:

ఈ మధ్య కాలంలో క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకి ఆదరణ పెరిగింది. అందుకే మేకర్స్ వీటిపై పడ్డారు. ఆ తరహాలో వచ్చిన వెబ్ సిరీస్ ' గాంత్'. ఈ సిరీస్ మొదటి నుండి చివరి వరకు ఎంగేజింగ్ గా సాగుతుంది. అయితే కథలోకి వెళ్ళడానికి దర్శకుడు ఎక్కువ సమయమే తీసుకున్నాడు.

కథలో వచ్చే కొన్ని ట్విస్ట్ లు, ఎవరి ఊహకందని క్లైమాక్స్  ట్విస్ట్ ఈ సిరీస్ ని మళ్ళీ చూసేలా చేస్తాయి. జతిన్ ఫ్యామిలీ ఎవరితో మాట్లాడకపోవడం, వారి జీవన శైలీ సహజంగా లేకపోవడంతో ఇన్వెస్టిగేషన్ చేసే పోలీసులకి కేసుని పరిష్కరించడం కాస్త కష్టంగా అనిపిస్తుంది. దాంతో వారు లోతుగా విచారణ చేయడం ప్రేక్షకుడిని ఉత్కంఠకు లోను చేస్తుంది. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ కథల్లో పోలీసుల హడావిడి ఒక రేంజ్ లో చూపిస్తూ ఉంటారు. కానీ ఈ కథ సహజత్వానికి చాలా దగ్గరగా వెళుతుంది. అందువలన సన్నివేశాలు నిదానంగా కదులుతూ, కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తాయి.

ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ఉంటాయి. ప్రతీ ఎపిసోడ్ లో ఓ ముఖ్యమైన పాయింట్ ఉండటంతో ఓ ఇంటెన్స్ కి క్రియేట్ చేసింది. ఈ కేసు విచారణ అనేక మలుపులు తిరుగుతూ ముందుకు సాగుతుంది. అయితే ప్రతి ఎపిసోడ్ ముగింపు ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది. ఆ తరువాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందోననే ఒక కుతూహలాన్ని పెంచుతూనే ఉంటాయి. సిరీస్ మొత్తంగా తక్కువ పాత్రలు కనిపించినా.. మిగతా పాత్రలు చాలానే వచ్చి వెళుతూ ఉంటాయి. అయిన ప్రతి క్యారెక్టర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆయా సీన్లకి వచ్చే లొకేషన్స్ ఈ కథకి అదనపు బలాన్ని ఇచ్చాయి. 

సాధారణంగా ఇలాంటి సిరీస్ లలో అసభ్య పదజాలం వాడటం, అశ్లీల దృశ్యాలు ఉంటాయి. కానీ మేకర్స్ అలాంటివేం లేకుండా జాగ్రత్త పడ్డారు. కథని మొదటి నుండి చివరి వరకు ఓ ఇంటెన్స్ తో తీసుకెళ్ళారు. ప్రతీక్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. సంజయ్ శర్మ ఎడిటింగ్ వర్క్ కూడా నీట్ గా అనిపిస్తుంది. రాఘవ్-అర్జున్ అందించిన మ్యూజిక్ బాగుంది. ఎక్కడ బోల్డ్ సీన్లు లేవు. 

నటీనటుల పనితీరు:

గదర్ సింగ్ గా మనవ్ విజ్ ఆకట్టుకున్నాడు. సత్యవతిగా సలోని బత్రా, గొస్సేయినిగా శ్రవణ్, సాక్షిగా మౌనిక తమ పాత్రలకి న్యాయం చేశారు.

ఫైనల్ గా :  క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కి ఈ సిరీస్ ఓ ఫీస్ట్. కామన్ ఆడియన్స్ ఓసారి చూసేయొచ్చు.

రేటింగ్ :  2.75 / 5

✍️. దాసరి  మల్లేశ్