ఏపీలో 19కు చేరిన పాజిటివ్ కేసులు
posted on Mar 29, 2020 7:40AM
కరోనా కేసులు, వ్యాప్తిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఒక రోజులోనే ఏపీలో 6 కొత్త కేసులు వెలుగు చూశాయి. గుంటూరులో ఒకే ఫ్యామిలీలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది.
ప్రకాశం జిల్లా చీరాలలో భార్యాభర్తలిద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. నవాబుపేటకు చెందిన వ్యక్తి ఢిల్లీ వెళ్లి రాగా.. ఆయనతోపాటు, ఆయన భార్యలోనూ కరోనా లక్షణాలు కనిపించడంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించిన క్వారంటైన్లో ఉంచారు. కర్నూలు జిల్లాలో రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడికి కరోనా సోకింది. విజయవాడకు చెందిన ఓ వ్యక్తికి కూడా కరోనా సోకిందని శనివారం నిర్ధారించారు. 65 ఏళ్ల వయసున్న ఈయన మార్చి 10 మక్కా నుంచి హైదరాబాద్ మీదుగా విజయవాడ వచ్చారు.
విదేశాల నుంచి వచ్చిన 29,264 మందిపై ప్రత్యేక నిఘా ఉంచామని.. క్వారంటైన్ కోసం 23,479 బెడ్లు సిద్ధం చేసినట్లు చెప్పారు. జిల్లాల వారీగా చూస్తే.. చిత్తూరు, ఈస్ట్ గోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైంది. విశాఖ, గుంటూరు జిల్లాల్లో నాలుగు చొప్పున కేసులు నమోదయ్యి. ఒంగోలు జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. వీరిలో నెల్లూరుకి చెందిన యువకుడు కరోనా నుంచి కోలుకున్నాడు.