వెయ్యేళ్లనాటి అలంపూరు నందికి జాతీయ గుర్తింపు

 పురావస్తు పరిశోధకుడు, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి

 జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూరు పట్టణంలోని స్థానిక పురావస్తు ప్రదర్శన శాలలో గల అరుదైన నంది శిల్పం జాతీయ స్థాయి గుర్తింపుకు నోచుకొందని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. ఢల్లీ లోని ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌ భారతీయ ఇతిహాసం, చరిత్రలో నంది శిల్పం అన్న అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సులో  గురువారం నాడు ఆయన   అలంపురం మ్యూజియంలోని, ఉమామహేశ్వర శిల్ప ఫలకంతో, క్రీ.శ.11వ శతాబ్దినాటి, కందూరు చోళుల కాలానికి చెందిన, నల్ల శానపురాతిలో నగీషీగా చెక్కబడిన నంది శిల్పంపై పరిశోధనాత్మక పత్రాన్ని సమర్పించారు.

ఇలాంటి శిల్పం భారతదేశంలోని మరే ప్రాంతంలోనూ వెలుగు చూడలేదని, అరుదైన ఈ శిల్పం, కళావిమర్శకులు, చరిత్రకారుల దృష్టికి తెచ్చినందుకు కర్నాటక చిత్రకళాపరిషత్‌కు చెందిన ఆచార్య రాఘవేంద్ర కులకర్ణి ఇంకా హాజరైన చరిత్రకారులు శివనాగిరెడ్డిని అభినందించారు. సదస్సు ముగింపు సభలో నిర్వాహకులు ఆయనను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. సదస్సుకు హాజరైన ప్రతినిధులు ఈ అరుదైన శిల్పాన్ని చూడటానికి త్వరలో అలంపూర్‌ సందర్శించటానికి ఆసక్తి చూపుతున్నారని శివనాగిరెడ్డి చెప్పారు.